షర్మిలకు నాయకుల సంఘీభావం

కర్నూలు:

జిల్లాలో సాగుతున్న షర్మిల పాదయాత్రకు ఇతర జిల్లాల నుంచి వైయస్ఆర్‌ కాంగ్రెస్ నాయకులు సంఘీభావంగా తరలివస్తున్నారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, వైజాగ్ నాయకులు మల్లి చిన్న, శ్రీనివాస రావు శనివారం కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. కొత్తగా నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్  కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ బి. జనార్దన్ రెడ్డి, కావలి ఇన్‌చార్జి రాంరెడ్డి ప్రతాపరెడ్డి, పార్టీ వైద్యుల విభాగం కన్వీనర్ జి. శివ భారత్ రెడ్డి పాదయాత్రలో షర్మిల వెంట నడిచారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, పార్టీ కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం, మాజీ మంత్రి ఎం. మారెప్ప, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి. మోహన్ రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు. 

చంద్రకళకు చదువుకళ.. 

     ఇంటర్మీడియెట్ పాసై పేదరికంతో డిగ్రీ చదవలేక కూలీ పనులకు వెళ్తున్న బాలికను షర్మిల అక్కున చేర్చుకున్నారు. తిరిగి కాలేజీకి వెళ్లి చదువుకుంటే ఖర్చులు తాను చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన విరూపాక్ష గౌడ్ కూతురు చంద్రకళ ఇంటర్మీడియెట్ సీఈసీలో ఉత్తీర్ణత సాధించారు. పేదరికంతో చదువు మానేసి కూలీ పనులకు వెళ్తున్నారు. పత్తి చేలో పత్తి తీస్తున్న వారిని షర్మిల పలకరించారు. పేదరికంతో తాను ఉన్నత చదువుకు దూరమయ్యానని, ఇవ్వాళ వైయస్ఆర్ బతికే ఉంటే తాను ధైర్యంగా డిగ్రీ చదివేదానినని చంద్రకళ చెప్పారు. 

ఆడోళ్లమే ఓట్లేసి గెలిపిస్తాం

    ‘జగన్ను జేళ్ల బెట్టి గెలుద్దామనుకుంటాండారు. ఆయన ఎక్కడున్నా ఆడోళ్లమే ఓట్లేసి గెలిపిత్తం. మొన్న జగన్‌కు(ఎమ్మిగనూరు బైఎలక్షన్‌లో) ఓటెయ్యొద్దని రూపాయలు పంచినారు.. ఓటు వేయకుండా ఉన్నామా? చంద్రబాబు ముందే ముంచేసిన మనిషి. ఇప్పుడొచ్చి అప్పుడు బాగచేయలేదు.. ఇప్పుడు జేస్తా అంటే.. ఆ మనిషిని ఎట్టా నమ్మేది?’’ అని తిమ్మాపూరానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు చాకలి శంకరమ్మ షర్మిలతో అన్నారు. ‘అన్న బాగుండాడా అమ్మా’ అని ఆమె షర్మిలను జగన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Back to Top