'షర్మిలకు 10 వేల మందితో స్వాగతం'

మహబూబ్‌నగర్:‌‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆయన సోదరి శ్రీమతి షర్మిల ఈ నెల 3న మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో‌కి ప్రవేశిస్తుంది. ఆ రోజున కోటకదిర చేరడంతో శ్రీమతి షర్మిల పాదయాత్ర మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో మొదలవుతుందని పార్టీ నాయకుడు, పాదయాత్ర నియోజకవర్గం ఇన్‌చార్జి ఎం. సురేందర్‌రెడ్డి వెల్లడించారు. తమ నియోజకవర్గంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర మొత్తం రెండు రోజుల పాటు కొనసాగుతుందన్నారు. శ్రీమతి షర్మిలకు తమ నియోజకవర్గంలో 10 వేల మందితో స్వాగతం పలుకుతామని సురేందర్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్‌ పట్టణ శివారులోని భగీరథ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సురేందర్‌రెడ్డి ఈ వివరాలు చెప్పారు.

సోమవారం 3వ తేదీన కోటకదిర చేరుకునే శ్రీమతి షర్మిల అక్కడి నుంచి ధర్మాపూర్‌ వెళతారు. రాత్రి ధర్మాపూర్‌లో బస చేస్తారని సురేందర్‌రెడ్డి తెలిపారు. 4వ తేదీ ఉదయం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభించి సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలోని క్లాక్ టవ‌ర్‌కు చేరుకుంటారన్నారు. క్లాక్‌ టవర్‌ వద్ద బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారని వివరించారు. తమ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర కొనసాగినన్ని రోజులూ సుమారు 2,000 మంది కార్యకర్తలు ఆమె వెంట పాల్గొంటారని చెప్పారు.

శ్రీమతి షర్మిల చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా దేశ చరిత్రలో సాహస మహిళగా నిలువనున్నారని సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రతిపక్ష నేత కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరిస్తూనే ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న శ్రీమతి షర్మిల.. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఉరవడి సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైల్లో నిర్బంధించినంత మాత్రాన ఆయన రాజకీయ ఎదుగుదలను కాంగ్రెస్, ‌టిడిపి నాయకులు ఆపలేరన్నారు.
Back to Top