హైదరాబాద్, 25 ఆగస్టు 2012 : రాష్ట్రంలో రోజురోజుకూ చేజారిపోతున్న ఓటు బ్యాంకును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉదయం ఎస్సీ, ఎస్టీలపై ఎనలేని ప్రేమ ఒలకబోశారు. షెడ్యూల్ కులాలు, తరగతుల అభివృద్ధి కోసం ఖర్చు చేసే నిధుల్లో ఇక నుంచి కోత విధించబోమని ప్రకటించారు. ఆ నిధులను పూర్తిగా ఖర్చుచేయని మాట వాస్తవమే అని అంగీకరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం కేటాయించిన 2 వేల కోట్ల రూపాయలు మిగిలిపోయాయని ఒప్పుకున్నారు. అభివృద్ధిలో ఎస్సీ, ఎస్టీలకు భాగస్వామ్యం ఉండాలన్నది తమ ప్రభుత్వ అభిమతం అన్నారు. సబ్ ప్లాన్ నిధులను కచ్చితంగా చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై అధ్యయనం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ నాయకత్వంలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ శనివారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి నివేదికను అందజేసింది. ఉదయం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఈ నివేదికను సమర్పించింది. ఉప ప్రణాళికపై కమిటీ వేయాలని సబ్ కమిటీ నివేదికలో సూచించింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పూర్తిగా వినియోగించాలని పేర్కొంది. పూర్తి స్థాయి నివేదికను సమర్పించేందుకు మరికొంత గడువు కావాలని సబ్ కమిటీ కోరినట్లు సమాచారం.క్షేత్ర స్థాయిలో పనులు కచ్చితంగా జరగాలంటే సరైన నిఘా ఎంతో అవసరం అని కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాల కో్సమే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం చేయలేదని వివరణ ఇవ్కడం కొసమెరుపు.