<strong>గుంటూరు:</strong> రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి సాధ్యమని, యువతకు ఉపాధి లభిస్తుందని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 134వ రోజు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి సీఎం హోదా కల్పించడంతో రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. మహానేత చనిపోయినా కూడా ఇప్పటికీ కూడా వైయస్ రాజశేఖరరెడ్డి పేరు తెలుగు రాష్ట్రల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. 2014లో ఏపీ విడిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని, వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను దగా చేశారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మాట తప్పారన్నారు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చంద్రబాబు చేపట్టలేదన్నారు. ఒక్క ఇరిగేషన్‌ప్రాజెక్టు కూడానిర్మించలేదన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు బలవంతంగా తీసుకున్నారని, అక్కడ ఇప్పటి వరకు ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేదన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్ జగన్ ఎన్నో పోరాటాలు చేశారని, యువతలో చైతన్యం నింపారన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన మొట్టమొదటి పార్టీ వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు. మరో ఏడాది పదవి ఉన్న ఎంపీలు రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు.