సర్కారే సమాధానం చెప్పాలి!

ధర్మవరం

26 అక్టోబర్ 2012 : ప్రజలను ఈ ప్రభుత్వం అన్ని విధాలా గాలికి వదిలేసిందని షర్మిల విమర్శించారు. ఏం తినాలి? ఎలా బతకాలి? అని జనం అడుగుతున్న ప్రశ్నలకు ఈ సర్కారే సమాధానం చెప్పాలని ఆమె అన్నారు. పాదయాత్రలో భాగంగా షర్మిల ధర్మవరం పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రధానప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగట్టారు. సాగునీటి మాట దేవుడెరుగు కనీసం తాగునీటికే కటకటగా ఉందంటూ జనం వాపోతున్నారని, దీనికి ఈ ప్రభత్వం ఏం సమాధానం చెబుతుందని ఆమె ప్రశ్నించారు. ధర్మవరం స్థానిక సమస్యలను షర్మిల ప్రస్తావించారు. నాలుగు లక్షల ఎకరాలకు నీరందించే హంద్రీ-నీవా ప్రాజెక్టుకు రూ. 45 కోట్లు ఖర్చు చేస్తే చాలు ప్రాజెక్టు పూర్తి అవుతుందనీ, అయినప్పటికీ మూడేళ్లుగా ఈ ప్రభుత్వం ఆ చిన్నపని కూడా చేయడం లేదనీ ఆమె విమర్శించారు. చంద్రబాబు తన హయాంలో హంద్రీ-నీవాకు రెండుసార్లు శిలాఫలకాలు వేసి గాలికి వదిలేశారని ఆమె గుర్తు చేశారు. వైయస్ అధికారంలోకి వచ్చాక నాలుగువేల కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటూ కలలు కన్నారని ఆమె గుర్తు చేశారు. చాలా భాగం పనులు కూడా పూర్తి అయ్యాయనీ, మిగిలిన ఆ కాస్త పనులూ పూర్తయితే కేవలం అనంతపురానికే నాలుగులక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆమె చెప్పారు.
దారిలో వస్తుండగా ఎందరో రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేశారనీ, అన్నం పెట్టే అన్నదాత కన్నీళ్లు పెడుతున్నాడని ఆమె అన్నారు. "మేం చనిపోవాల్సిందేనా అని వారు అడుగుతున్నారు. నీళ్లు లేవు, అప్పులున్నాయి, ఇన్సూరెన్స్ రాదు. కనీసం పిల్లల్ని చదివించుకునే పరిస్థితీ లేదు. కూలికి పోదామన్నా పనులు లేవు. ఈ పరిస్థితికి ఎవరు కారణం?" అని షర్మిల ప్రశ్నించారు.
"రాజశేఖర రెడ్డిగారు ఉన్నప్పుడు పెన్నా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు 10 టిఎంసిల నీరివ్వాలని చెప్పాడు. అవి ఇవ్వకపోతే ఇక్కడ తాగునీరు లేదు. లేకపోతే ఇక్కడ భూగర్భజలాలు ఎండిపోతాయి. అందుకే ప్రతి ఏడాదీ తప్పక నీళ్లు ఇవ్వాలని ఉత్తర్వులు కూడా ఇచ్చారు. కానీ రెండేళ్లుగా ఈ  ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో దాదాపు 30 వేల బోర్లు ఎండిపోయాయి. మేం ఏదీ పండించుకోలేదు. ఏదీ సంపాదించుకోలేదు. మేం ఏమి తిని బతకాలి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం సర్కారే చెప్పాలి. ఈ ప్రభుత్వం అన్ని విధాన ప్రజల సమస్యలను గాలికి వదిలేసింది."అని షర్మిల దుయ్యబట్టారు. పేదలు పెద్ద చదువులు చదువుకోవడానికి వీల్లేకుండా పోయిందనీ, ఫీజుల పథకానికి కత్తెరలు పెట్టారనీ ఆమె విమర్శించారు. "ఏం అడుక్కునేవారికి ఇస్తున్నారా?" అని ఆమె ఆగ్రహంగా ప్రశ్నించారు. వైయస్ ఆరోగ్యశ్రీ పథకం పెట్టి పేదలకూ కార్పొరేట్ వైద్యం అందిస్తే, ఈ ప్రభుత్వం దానిని నీరుగార్చిందనీ, ప్రధాన వ్యాధులెన్నిటినో దాని నుండి తొలగించారనీ ఆమె అన్నారు. పేదలకు జబ్బు వస్తే ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లాలట. రాజకీయనాయకులకు జబ్బులొస్తే కార్పొరేట్ ఆసుపత్రులకో, లేక విదేశాలకో వెళ్తారట...అని ఆమె వ్యంగ్యంగా  వ్యాఖ్యానించారు.
వంట గ్యాస్ సిలిండర్ ధర అమాంతం పెరిగిపోయిందనీ, రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నప్పుడు ధర పెరిగినా మన మహిళలకు భారం కాకూడదని రాష్ట్ర ఖజానా నుండే భరించారనీ ఆమె గుర్తు చేశారు. చంద్రబాబుకు ముందు సిలిండర్ ధర రూ. 145 ఉండిందనీ, తొమ్మిదేళ్ల పరిపాలనలో అది రెట్టింపై రూ. 305 కు చేరిందనీ ఆమె అన్నారు. కానీ రాజశేఖర్ రెడ్డిగారు సిలిండర్ ధరను రూ. 305 నుండి ఒక్క రూపాయి కూడా పెరగనివ్వలేదని ఆమె చెప్పారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్‌కు రూ. 800 చెల్లించాలంటున్నారని ఆమె విమర్శించారు. ఇలా ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందన్నారు. నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం నిలదీయడం లేదనీ, కిరణ్‌తో పోటీ పడి చంద్రబాబు కూడా నిద్రపోతున్నారనీ షర్మిల ఎద్దేవా చేశారు. బాబు వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ చేసిన వాగ్దానాలైన రెండు రూపాయల బియ్యం, మద్యనిషేధం కార్యక్రమాలకు తూట్లు పొడిచారని ఆమె దుయ్యబట్టారు. పైగా ప్రాజెక్టులు కడితే నష్టమనీ, వ్యవసాయం దండగనీ, ఉచితంగా ఏదీ ఇవ్వకూడదనీ తన మనసులో మాట పుస్తకంలోనే రాసుకున్నారని ఆమె ప్రస్తావించారు. బాబు హయాంలో నాలుగువేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని షర్మిల గుర్తు చేశారు. ఈ పాపం బాబుది కాదా అని ఆమె ప్రశ్నించారు. జగనన్న జనం మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నారనే ఉద్దేశ్యంతో జైలు పాలు చేశారని ఆమె అన్నారు. అయితే ఈ కుట్రలు ఇక ఎంతో కాలం సాగబోవనీ, జగనన్నను దేవుడే బయటకు తీసుకువస్తాడనీ, ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరనీ, ఆ రోజు  జగనన్ననూ ఎవరూ ఆపలేరనీ ఆమె దృఢంగా వ్యాఖ్యానించారు. ఆ రోజు రాజన్న రాజ్యం దిశగా సాగుతామనీ, కోటి ఎకరాలకు నీరందించాలన్న రాజశేఖర రెడ్డి కలలను జగనన్న నిజం చేస్తారనీ ఆమె అన్నారు. అప్పుడు మన పిల్లలు పెద్ద చదువులు చదువుకోగలరనీ, తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్తు ఉంటుందనీ, రైతులకు, చేనేత కార్మికులకు వడ్డీ లేని రుణాలు వస్తాయనీ, వృద్ధులకూ వికలాంగులకూ పింఛన్లు పెరుగుతాయనీ షర్మిల హామీ ఇచ్చారు. సభలో వైయస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తదితరులు పాల్గొన్నారు
ధర్మవరం రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వైయస్ విగ్రహానికి వైఎస్ విజయమ్మ, షర్మిల పూలమాలు వేసి నివాళులర్పించారు.

Back to Top