'సమస్యల పరిష్కారానికే షర్మిల పాదయాత్ర'

మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా) : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. పాలక కాంగ్రెస్‌ పార్టీని, దానికి తొత్తుగా వ్యవహరిస్తున్న ప్రధాన ప్రతిపక్షం టిడిపిని ప్రజాసమస్యలపై ప్రశ్నించడానికి పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో బుధవారం పునఃప్రారంభమైన శ్రీమతి షర్మిల పాదయాత్రకు మహేశ్వరం నియోజకవర్గం నుంచి నాయకులు అధిక సంఖ్యలో తరలివెళ్లి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సమస్యలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేద‌ని ఆరోపించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న అశేష ఆదరణను చూసి పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కయి ఆయనపై కుట్రలు చేస్తున్నాయని భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, శ్రీ జగన్‌పై అక్రమంగా పాల్పడుతున్న వేధింపులను పాదయాత్ర ద్వారా జనం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

మహేశ్వరం, కందుకూరు, సరూర్‌నగర్, ఆ‌ర్‌.కె.పురం డివిజన్ల నుంచి సుమారు 50 వాహనాల్లో వెయ్యి మంది ర్యాలీగా వెళ్లి శ్రీమతి షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. బొంగ్లూరు గేటు వద్ద శ్రీమతి షర్మిలను కలిసిన నాయకులు అక్కడి నుంచి ఆమెతో కలిసి ఇబ్రహీంపట్నం వరకు పాదయాత్ర చేశారు.
Back to Top