'సహకార వ్యవస్థకు జీవం పోసిన మహానేత వైయస్'

నిడదవోలు (పశ్చిమ గోదావరి జిల్లా) : గ్రామీణాభివృద్ధిలో ప్రముఖ పాత్ర నిర్వహించే సహకార సంఘాలను చంద్రబాబు నాయుడు తన హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దుమ్మెత్తిపోశారు. చితికిపోయిన సహకార సంఘాలకు తిరిగి దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ‌జవం, జీవం పోశారని వారు పేర్కొన్నారు. సహకార సంఘాల ఎన్నికలపై నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిడదవోలులో జరిగింది. నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు.

టిడిపి ప్రభుత్వ హయాంలో చితికిపోయిన సహకార సంఘాలకు రుణాలు మంజూరుచేసి తిరిగి వాటి మనుగడకు నాంది పలికిన ఘనత మహానేత వైయస్‌ఆర్‌కే దక్కుతుందని ఈ సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. సహకార ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో సహకార ఎన్నికల్లో వైయస్‌సిపికి విజయవకాశాలు ఉన్నాయని చెప్పారు. రైతు సంక్షేమం కోసం వైయస్‌ఆర్ ఎన్నో పథకాలు అమలు చేశారని, ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తున్న వై‌యస్‌ఆర్‌సిపిని గెలిపించాలన్న తపన అన్ని ప్రాంతాల్లో కనిపిస్తోందన్నారు.

రైతులను ఓటు అడిగే నైతిక హక్కు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీకి మాత్రమే ఉందని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగానే టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడే అవకాశాలున్నాయని, సహకార ఎన్నికల్లో ప్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. పార్టీ జిల్లా పరిశీలకులు జగ్గిరెడ్డి తదితరులు సమావేశంలో మాట్లాడారు.
Back to Top