సహకార ఎన్నికల్లో విజయం మాదే

నెల్లూరు:

సహకార సంఘాల ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీకి అండగా ఉండే అధికారులపై చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌ఓ రామిరెడ్డిని కలిసి మేకపాటి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సొసైటీ ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తోందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సొసైటీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. సొసైటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్నివర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోపాటు అన్నిరంగాలను కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వాపోయారు.
       పేద, సామాన్య ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, పదవుల కోసం అధికార పార్టీ నాయకులు పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులంతా వైయస్ఆర్ సీపీ వెంటే ఉన్నారని అన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు రైతులను మభ్యపెట్టి సొసైటీ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారన్నారు. అలాంటి వారి మాటలు రైతులు వినే పరిస్థితిలో లేరన్నారు. వరికుంటపాడు మండలంలో ఓ రైతుకు సంబంధించిన భూమిని 10 మంది అనుభవదారులుగా సృష్టించి, వారికి ఓటు హక్కు కల్పించే యత్నాలు సాగుతున్నాయని చెప్పారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు వీఆర్‌ఓ సహకరించడం దారుణమన్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రె డ్డిని సీఎంగా చూడాలన్న ప్రజల ఆకాంక్ష త్వరలోనే నెరవేరబోతుందని మేకపాటి ఆశాభావం వ్యక్తం చేశారు.

Back to Top