బాబువి నీతిమాలిన రాజకీయాలు

()సీఎం పదవి కోసం హోదా తాకట్టు 
()కేంద్రం ఏపీకి కొత్తగా ఇచ్చిందేమీ లేదు
()పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు
()వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు

హైదరాబాద్ : ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా  విమర్శించారు. చంద్రబాబు దురాలోచనలు, నీతిమాలిన రాజకీయాలను ప‍్రజలంతా గమనిస్తున్నారని, ఈ తరుణంలో హోదా సాధన కోసం ప్రజలంతా ఒక్కటి కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే టీడీపీ, బీజేపీ కలిసి ఏపీ ప్రజలకు చెవిలో కుళ్లిపోయిన క్యాబేజీలు పెట్టారని రోజా మండిపడ్డారు. జైట్లీ ప్రకటనతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేకపోయినా చంద్రబాబు ఆ ప్రకటనను స్వాగతిస్తున్నామనడం దారుణమన్నారు. అసెంబ్లీ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. 

ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని, ప్రతి రాష్ట్రానికి ఇచ్చినట్లుగానే ఏపీకి కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. రాజధానికి, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదని రోజా అన్నారు. రెవెన్యు లోటు 16వేల కోట్లు ఉంటే కేవలం రూ.4వేల కోట్లు ఇచ్చారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతకు అసెంబ్లీలో కనీసం మైక్ కూడా ఇవ్వలేదని రోజా అన్నారు. స్వాగతించాక చంద్రబాబు ప్రకటన ఇస్తే దానివల్ల ఉపయోగం ఏముందని ఆమె ప్రశ్నించారు. ఆయన ప్రకటనతో ఎలాంటి ఉపయోగం ఉండదని, సమస్య సమాధి అవుతుందన్నారు. ప్రజల కోసం పోరాడే తమ గొంతులను నొక్కేయడం సరికాదని, హోదా కోసం తాము బంద్ చేస్తుంటే మరోవైపు బంద్ను విఫలం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.

పవన్ కల్యాణ్ మాటలు చిన్నపిల్లల మనస్తత్వంలా ఉన్నాయని రోజా వ్యాఖ్యానించారు. ఆయన అవగాహన రాహిత్యంతో కాకినాడలో బహిరంగ సభ జరిపారని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక వైపు బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెబుతుంటే .. ప్రత్యేక హోదాపై క్లారిటీ కావాలని అడగటం హస్యాస్పదంగా వుందన్నారు . హోదాపై పవన్ కల్యాణ్ కి ఎలాంటి కార్యాచరణ లేదని దుయ్యబట్టారు.  ప్రధాని మోదీ, చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. వాళ్లను ప్రశ్నించకుండా టీజీ వెంకటేష్ను తిడితే ఏం వస్తుందన్నారు. ప్రత్యేక హోదా సహా 600 హామీలను చంద్రబాబు ఇస్తే... వాటిపై పవన్ ఒక్కసారి కూడా ప్రశ్నించలేదన్నారు. తాము నిరంతరం ప్రత్యేక హోదాపై పోరాడుతున్నామని తెలిపారు. బీజేపీ, టీడీపీ ఒక్కటై ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని రోజా ధ్వజమెత్తారు.
Back to Top