రైతులపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం

వీరపునాయునిపల్లెః ఈ ప్రభుత్వానికి రైతులపై ఎలాంటి చిత్తశుద్ది లేదని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాధరెడ్డి విమర్శించారు. వీరపునాయునిపల్లె మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు గోనుమాకులపల్లె,పాలగిరి తదితర గ్రామాలలో దెబ్బతిన్న వేరుశెనగ, పత్తి పంటలను ఆయన పరిశీలించారు. ఈ సంధర్భంగా భాదిత రైతులతో ఆయన మాట్లాడారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి పాగు చేసిన పంటలు వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నాయని, కాయలతో కూడిన వేరుశెనగ కట్టె కూడా నీటిలో కొట్టుకొని పోయిందని ఆయన దృష్టికి తీసుకవచ్చారు. అదే విధంగా పత్తి పంట కూడా నీటిలో మునిగిపోయిందని, పొలంలో ఉన్న కాయలు కూడా మొలక వస్తున్నాయని ఇంత జరిగినా ఏ ఒక్క అధికారి కూడా పొలాలను పరిశీలించిన పాపానపోలేదని తెలిపారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... ఈ ప్రభుత్వానికి రైతులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. పంటలు నష్టపోయిన సమయంలో రైతులను ఏవిధంగా కూడా ఆదుకోవడం లేదని విమర్శించారు. అనంతరం జరిగిన పంట నష్టం వివరాలను జిల్లా కలెక్టర్,జేడీఏ దృష్టికి కూడా ఫోన్‌లో తీసువెళ్ళారు. ఆతరువాత వీరపునాయునిపల్లెలోని విత్తన పంపిణీ కేంద్రం వద్దకు వెళ్ళి విత్తనాలను పరిశీలించారు. అక్కడ కూడా రైతులతో మాట్లాడారు. రైతులకు మంచి నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాలని ఏవో అరవిందనాయక్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రఘునాదరెడ్డి, జిల్లా ప్రదాన కార్యదర్శి వీరప్రతాపరెడ్డి, ఎంపీటీసీలు రవి,చెండ్రాయుడు, సర్పంచులు జంగంరెడ్డి,పుల్లారెడ్డి, ప్రతాప్, వెంకటరెడ్డి, సొసైటీ డైరెక్టర్లు వెంకట్రామిరెడ్డి, బాబు, నాయకులు వెంకటరెడ్డి, శేఖరరెడ్డి, రామచంద్రారెడ్డి, ఈశ్వరరెడ్డి, బ్రహ్మానందరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.


Back to Top