రైలు ప్రమాదానికి మంత్రే బాధ్యత వహించాలి

పుట్టపర్తి (అనంతపురం జిల్లా),

28 డిసెంబర్ 2013: బెంగళూరు - నాందేడ్‌ రైలులో అగ్ని ప్రమాదానికి కేంద్రప్రభుత్వం, రైల్వే శాఖ మంత్రి బాధ్యత వహించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రమాదాల నివారణ విషయంలో కేంద్రం తీసుకునే చర్యలు పారదర్శకంగా ప్రజలకు తెలిసేలా ఉండాలని అన్నారు. ప్రమాదాలు జరిగిన తరువాత కమిషన్లు వేసి, నష్ట పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు.

బెంగళూరు - నాందేడ్ రైలు ప్రమాదం వార్త తెలిసిన వెంటనే శ్రీ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సమైక్య శంఖారావం యాత్రను వాయిదా వేసుకుని హుటాహుటిన దుర్ఘటన చోటుచేసుకున్న అనంతపురం జిల్లా కొత్తచెరువు చేరుకున్నారు. ఈ రైలు కొత్తచెరువు సమీ‌పానికి వచ్చిన తరువాత బి 1 ఏసి కోచ్లో‌ మంటలు వ్యాపించి 26 మంది దుర్మరణం చెందారు. రైలు అగ్ని ప్రమాదంలో క్షతగాత్రులు, మృతుల కుటుంబీకులను ఆయన పరామర్శించారు. అనంతరం పుట్టపర్తి రైల్వే స్టేషన్లో ‌శ్రీ జగన్‌ మీడియాతో మాట్లాడారు.

గడచిన 16 నెలల వ్యవధిలో మన రాష్ట్రంలో మూడు సార్లు రైళ్ళలో అగ్నిప్రమాదాలు జరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. మన రాష్ట్రంలో ఇది మూడవ రైలు ప్రమాదం అన్నారు. 2012 మే 21న పెనుకొండలో ప్రమాదం జరిగిందని, జూలై 30న నెల్లూరు సమీపంలో రెండవ దుర్ఘటన జరగగా ఇప్పుడిది మూడవ దుర్ఘటన అని శ్రీ జగన్‌ గుర్తుచేశారు. తరచూ ఇలాంటి దుస్సంఘటనలు జరుగుతున్నా భద్రతా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించారు.

ఇంత జరుగుతున్నా విచారణ నివేదికలు రావన్నారు. ప్రమాదాలు ఎలా జరిగాయో కారణాలు తెలియవన్నారు. ఈ రోజు జరిగిన ప్రమాదంపైన కూడా కమిషన్ వేస్తామంటారని విమర్శించారు. ఇంతమంది చనిపో‌వడానికి సమస్య ఇది అని చెప్పరని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా పరిష్కరించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రయాణికుల్లో విశ్వాసం నెలకొల్పడానికి చర్యలేవీ ఈ ప్రభుత్వం తీసుకోదన్నారు. ఈ రోజు జరిగిన ప్రమాదంలో దగ్ధమైన బోగీ పాతదని విమర్శించారు. పనికిరాని బోగీలనే రైల్వే బోగిలను వినియోగిస్తుండడం వల్లే మళ్ళీ మళ్ళీ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని శ్రీ జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి సూచించారు.

ఇటీవలి కాలంలో నడిరోడ్డుపై నాలుగు ఓల్వో బస్సులు అగ్నికి ఆహుతైపోగా పలువురు సజీవ దహనం అయిపోయారని శ్రీ జగన్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్ని ప్రమాద సంఘటనలు జరిగినా, ఎంతమంది ప్రానాలు పోతున్నా కేంద్రం గానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు.

భద్రంగా గమ్యం చేరుకుంటామన్న భరోసాను ప్రయాణికులకు ప్రభుత్వం కల్పించాలని శ్రీ జగన్‌ అన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించడంతోనో, గాయపడిన వారిని ఆస్పత్రులలో చేర్పంచడంతోనో, లేదా కమిషన్లు ఏర్పాటు చేయడంతోనో తన పని అయిపోయిందన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించకూడదన్నారు. రూ.5 లక్షలో లేదా రూ. 15 లక్షలో పరిహారాన్ని ప్రయాణికులు ఆశించడం లేదని, క్షేమంగా గమ్యానికి చేరతారన్న ధీమా తమకు కలిగించాలని కోరుకుంటున్నారన్నారు.

రైల్వే మంత్రిత్వ శాఖ తన తీరును మార్చుకోవాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని శ్రీ వైయస్‌ జగన్‌ సూచించారు. రైల్వేల సాంకేతిక, నిర్వహణకు సంబంధించిన నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అత్యంత జాగరూకతతో భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top