కర్నూలు, 12 నవంబర్ 2012: ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఎంఐఎం మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి ఇక అధికారంలో కొనసాగే అవకాశం ఎంతమాత్రమూ లేదని సోమవారం ఇక్కడ అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవసంబిస్తున్నదంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం సోమవారంనాడు మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో శోభా నాగిరెడ్డి పై విధంగా స్పందించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని ఆమె అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం పెట్టారని శోభా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మైనార్టీలో పడిన ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు టిడిపి ముందుకు రాకపోవడం శోచనీయమని ఆమె అన్నారు. చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి సంఖ్యా బలం కూడా తగ్గిందని శోభా నాగిరెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని ప్రజలు వేచి చూస్తున్నారని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కిరణ్ ప్రభుత్వం తక్షణమే బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శోభానాగిరెడ్డి డిమాండ్ చేశారు.
ఎంఐఎం మద్దతుతోనే మొన్న పెట్టిన అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ పార్టీ అధికారం నిలబెట్టుకున్నదని శోభా నాగిరెడ్డి అన్నారు. ఇప్పుడు అదే ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడంతో కిరణ్ సర్కార్ మైనార్టీలో పడిందన్నారు. మైనార్టీలో ఉన్న కిరణ్ ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాల్సి అవసరం ఉందన్నారు.