రాష్ట్రపతిని కలిస్తే తప్పేంటి?: కొణతాల

అనకాపల్లి: వైయస్ఆర్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పాటు కొందరు నేతలు రాష్ట్రపతిని కలిస్తే తప్పేంటని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ప్రశ్నించారు. చంద్రబాబులా రహస్యంగా కలవలేదన్నారు. టీడీపీ నేతలు ఇదేదో రహస్య అజెండా అని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  చంద్రబాబునాయుడు ప్రధానిని, కేంద్ర మంత్రి చిదంబరాన్ని, కర్ణాటక గవర్నర్ భరద్వాజ్‌ను కలవడం ద్వారా ఏ సంకేతాలు పంపించారో అందరికీ తెలుసునని ఆరోపించారు. ఏ కేసుల నుంచి తప్పించుకునేందుకు బాబు రహస్యంగా కలిశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. దేశంలో అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న రాష్ట్రపతిని కలిసి జగన్ తరపున శుభాకాంక్షలు తెలిపినట్టు విజయమ్మ బహిరంగంగానే వెల్లడించారని చెప్పారు. వైయస్ఆర్‌ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నిరంతరం జనం మధ్య ఉండడాన్ని టీడీపీ, కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకే ఆయనకు బెయిల్ రాకుండా కుయుక్తులు పన్నుతున్నారని కొణతాల ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీల డెరైక్షన్‌లోనే సీబీఐ దర్యాప్తు జరుగుతుందడానికి ఎన్నో ఉదాహరణలున్నాయన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీలోని ఒక ఎమ్మెల్యే ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగా జరుగుతున్న దర్యాప్తు వ్యవహారమే దీనికి నిదర్శనమని చెప్పారు. సీబీఐకి ఈ అఫిడవిట్‌ను అందజేసింది టీడీపీ నేతలేనన్నారు. దీన్ని బట్టి ఈ రెండు పార్టీలూ మూకుమ్మడిగా కుట్ర పన్నుతున్నాయని ప్రజలకు అర్థమవుతోందన్నారు. ఎమ్మార్ కేసు మూలాల్లోకి వెళ్తే చంద్రబాబు నిర్ణయాలపైనే దర్యాప్తు జరపాలని అభిప్రాయపడ్డారు. ఎమ్మార్ కేసులో చంద్రబాబును కాపాడడం ద్వారా కాంగ్రెస్, టీడీపీలకు సీబీఐ అనుకూలంగా ఉందనేది తేటతెల్లమవుతోందన్నారు.

బూటకపు యాత్ర : చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర అంతా బూటకమని కొణతాల అన్నారు. చంద్రబాబు తనకు తాను రాసుకున్న ‘మనస్సులో మాట’ పుస్తకంలోని అంశాలకు విరుద్ధంగా పాదయాత్రలో హామీల వర్షం కురిపిస్తున్నారని విమర్శించారు. ఒకసారి ఉచిత విద్యుత్ ఇస్తానని, మరోసారి కరెంట్ తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలని చెప్పడం ద్వారా చంద్రబాబు రెండునాల్కల ధోరణి తెలుస్తోందన్నారు.

Back to Top