రాష్ట్రంలో వ్యవసాయ యంత్రాల పరిశోధన కేంద్రం

న్యూఢిల్లీ : వ్యవసాయంలో ఆర్థిక, విధానపరమైన అంశాలపై పరిశోధనల కోసం ఒక్కొక్క జోన్‌కు ఒక్కొక్క ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎం.వి.ఎ‌స్.‌ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇలాంటి పరిశోధన కేంద్రం ఢిల్లీలో మాత్రమే ఉందని, అది కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని ఆయన తెలిపారు. ఢిల్లీలో సోమవారం జరిగిన భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసిఎఆర్) సర్వసభ్య సమావేశంలో ఆయన జో‌న్-2 (ఆంధ్రప్రదే‌శ్, ఒడిషా, పశ్చిమ బెంగా‌ల్, అండమా‌న్, నికోబా‌ర్) రైతు ప్రతినిధిగా హాజరయ్యారు.

భోపా‌ల్‌లో ఉన్న కేంద్ర యాంత్రీకరణ వ్యవసాయ పరిశోధన సంస్థ అన్ని ప్రాంతాల అవసరాల మేరకు పరిశోధనలు చేయడంలేదని నాగిరెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ దృష్టికి తీసు‌కు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతుకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చే యంత్రాల తయారీకి ప్రత్యేక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. సేంద్రియ వ్యవసాయం, ఉత్పత్తులు, మార్కెటింగ్‌కు పూర్తిస్థాయి పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలని నాగిరెడ్డి సూచించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర ఉన్న రంగు పత్తి సాగును ప్రోత్సహించాలని ఎం.పి. రేణుకా చౌదరి సూచించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, విశ్వరూప్ రాకపోవ‌డాన్ని నాగిరెడ్డి తప్పుపట్టారు.
Back to Top