హైదరాబాద్ 23 అక్టోబర్ 2012: రియల్ క్విడ్ ప్రో కో కాంగ్రెస్, టిడిపిల మధ్యే ఉందని, రాష్ట్రంలో ఉన్నది సైకిల్ కాంగ్రెస్ అనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు అన్నారు. టిడిపి ఇవాళే ఏం చెబుతుందో కాంగ్రెస్ రేపు అదే చేస్తోందని ఆయన విమర్శిం చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి టిడిపి బ్రాంచ్ ఆఫీసుగా మారిందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై కేసులు లేకుండా చూడడం కాంగ్రెస్ బాధ్యత అయితే, ప్రభుత్వాన్ని కాపాడడం టిడిపి బాధ్యతగా కథ సాగుతోందని ఆయన ఎత్తిపొడిచారు. జగన్మోహన్ రెడ్డికి జైలులో సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ టిడిపి నేతలు ఆరోపించడం చూస్తుంటే మరో కుట్రకు తెరలేచినట్లు కనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆశలుడిగి, నిస్పృహతో అవాకులూ చవాకులూ పేలుతున్నారన్నారు. బాబుకు చిన్నమెదడు చిట్లినట్టుందని ఆయన దుయ్యబట్టారు.
కాంగ్రెస్ దోమ కుడితే డెంగ్యూ వస్తుందనీ, వైయస్సార్ సీపీ దోమ కుడితే చికున్ గున్యా వస్తుందనీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు స్థాయి తక్కువ మాటలని రామచంద్ర రావు ఆక్షేపించారు. నేడు దుస్థితిలో ఉన్న టిడిపికి పట్టిన రోగాలకు ఏ దోమకాటు కారణమో బాబు చెప్పాలని ఆయన అన్నారు. ఏ ప్రాంతంలో ఎక్కడ పోటీ చేసినా టిడిపికి డిపాజిట్లు కూడా రావడం లేదని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ఒక ఖలుడనీ, ఖలునికి నిలువెల్లా విషమే ఉంటుందంటూ సుమతీశతకంలోని ఓ పద్యాన్నిఆయన చదివారు. కనుక బాబును దోమ కుడితే ఆ దోమే చచ్చిపోతుందని ఆయన ఎగతాళి చేశారు.
2004, 2009 ఎన్నికల్లో ప్రజలు బాబుకు బుద్ధి చెప్పారనీ, ప్రజల చేత అలా ఛీత్కరించబడిన, ఈసడించబడిన వ్యక్తి చంద్రబాబు అని రామచంద్ర రావు వ్యాఖ్యానించారు. బాబు వస్తే కరువు వస్తుందన్న భయంతో జనం తమ ఊళ్లకి రావద్దంటూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
దద్దమ్మ, దరిద్ర ప్రభుత్వమని తిడుతూనే దాన్ని నిలబెడుతున్న చంద్రబాబు విశ్వాస తీర్మానం పెట్టి కాంగ్రెస్ ఋణం తీర్చుకుంటే మంచిదని ఆయన వ్యంగ్యంగా సూచించారు. అవిశ్వాస తీర్మానం పెడితే, ప్రభుత్వం పడిపోతే, ఎన్నికలు వస్తే వైయస్ఆర్ సీపీ ప్రభంజనంలో కొట్టుకుపోతామనే భీతితో ఉన్న చంద్రబాబు విశ్వాస తీర్మానం పెట్టి ధైర్యంగా ముందుకు రావాలని ఆయన సలహా ఇచ్చారు.
షర్మిల పాదయాత్రతో టిడిపి గుండెల్లో రైళ్లు -
బాబు పాదయాత్రలో పసలేదంటూ తేలిపోయింది. పాదయాత్రను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. షర్మిలమ్మ పాదయాత్ర ప్రారంభించగానే తెలుగుదేశం పార్టీవాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. షర్మిలమ్మ పాదయాత్రకు జనం వచ్చిన జనమైతే, బాబు పాదయాత్రకు జనం తెచ్చిన జనమని రామచంద్ర రావు వ్యాఖ్యానించారు. అందుకే పాదయాత్ర తిరుగుయాత్రలాగా ఇంటి యాత్రలాగా తయారైందని ఆయన అన్నారు. ప్రధానమంత్రులనీ, రాష్ట్రపతులనీ తానే నియమింపజేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు జనంలో ఎలా మసలుకోవాలో తెలియలేదని ఆయన దెప్పిపొడిచారు. ఆయన నాయకత్వంలో ఉన్న టిడిపి నేతలు కొందరు కన్నూమిన్నూగానక అవాకులూ చవాకులూ మాట్లాడుతున్నారని రామచంద్ర రావు విమర్శించారు. రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా, వ్యక్తిస్వేచ్ఛను కూడా హరించే విధంగా టిడిపి నేతలు బైబిల్ వివాదాన్ని లేవనెత్తారని, మతాల గురించి, కులాల గురించి, ప్రాంతాల గురించి మాట్లాడుతున్నరనీ ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు వస్తే, పుట్టగతులుండవన్న భయంతో టిడిపి నాయకులు మళ్లీ జైలులో జగన్‌కు అన్నిసెల్‌ఫోన్‌తో సహా సకల సౌకర్యాలూ కల్పిస్తున్నారంటూ ఆరోపణలు మొదలుపెట్టారన్నారు. యనమల రామకృష్ణుడు ఈ ఆరోపణలు చేశారనీ, టిడిపివాళ్లు ఇలా మాట్లాడుతున్నారంటే మరో కుట్రకు తెర లేపారనే అర్థమనీ, అదేమిటో బయటపెట్టాలనీ ఆయన డిమాండ్ చేశారు. ఇదివరలో కూడా టిడిపివాళ్లు సిబిఐ దర్యాప్తు కోరగానే అది జరిగిందనీ, బులెట్ ప్రూఫ్ కారును గురించి మాట్లాడగానే జగన్మోహన్ రెడ్డిని వ్యాన్లో తీసుకుపోయరని, టిడిపి ఎంపీలు ఇడి జోక్యం కోరగానే ఆస్తులు జప్తు అయ్యాయని ఆయన గుర్తు చేశారు.
మీకు జైలు తప్పదు-
జనంలోకి వెళ్లే దమ్ము లేక జైలు గురించి మాట్లాడడం మొదలుపెట్టారని ఆయన టిడిపి నేతలపై నిప్పులు చెరిగారు. జననేత జనంలో ఉంటేనే ప్రజాస్వామ్యమని ఆయన అన్నారు. కానీ జననేతను జైలులోనే ఉంచాలని నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ' 'జైలులో అన్ని సౌకర్యాలు ఉంటే మీరూ జైలుకు వెళుదురు గాని, మీరు చేసిన పాపాలకు ఎలాగూ జైలు తప్పదు' అని ఆయన అన్నారు. ఆధారాలుంటే నిరూపించాలని లేదా రాజకీయాలు మానుకోవాలని ఆయన సవాలు విసిరారు. ఏమాత్రం సిగ్గూ శరం లేదని ఆయన టిడిపి నాయకుల తీరును దుయ్యబట్టారు. పదవి పోగొట్టుకున్న ఎన్టీఆర్‌ని అసెంబ్లీలో మాట్లాడనివ్వని చరిత్ర యనమలదని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అంతిమదశలో ఉందని, అందుకే ఇలా బెంబేలెత్తుతున్నారనీ, నిస్పృహతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారనీ ఆయన అన్నారు.
పులివెందులలో జనం సమస్యలు చెబితే, అక్కడి సమస్యలకు స్తానిక ఎమ్మెల్యేది బాధ్యత కాదా అని టిడిపి నాయకులు అడుగుతున్నారనీ, ఈ ప్రభుత్వంపై ఏ మాత్రం విమర్శను కూడా వాళ్ల సహించలేకపోతున్నారనీ రామచంద్ర రావు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పులివెందులలో చీనీచెట్లు ఎండిపోవడంపై విజయమ్మ లేఖ రాశారనీ, ధర్నా కూడా చేశారని ఆయన గుర్తు చేశారు. తొమ్మిదేళ్లు పరిపాలించారు కదా, మరి ఇంకా రాష్ట్రంలో ఇన్ని సమస్యలెందుకు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి కాని, ప్రజానాయకులపై కాదని ఆయన హెచ్చరించారు. మళ్లీ తొమ్మిదేళ్ల ఆ పరిపాలనను తీసుకువస్తానని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఆయన సవాలు విసిరాలు. టిడిపి బుట్ట ఖాళీ అవుతుందనే భయంతోనే ఎప్పుడూ వైయస్ కుటుంబం మీద పడి ఏడుస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు.