రాష్ట్రంలో అవినీతి మంత్రులపై ఎందుకంత ప్రేమ?

గుంటూరు, 12 మే 2013: కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనీకుమార్‌ను మాత్రమే తొలగించి బొగ్గు కుంభకోణంలో సిబిఐ నివేదికను తారుమారు చేసిన వారంతా తప్పుకుపోవాలని ప్రయత్నించడం దురదృష్టకరం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ సభ్యుడు అంబటి రాంబాబు తప్పుపట్టారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ లేదా సోనియా గాంధీ ఆదేశాల మేరకు వ్యవహరించిన అశ్వనీకుమార్‌ ఒక్కరినే బాధ్యుడిని చేశారన్నారు. ఈ కుంభకోణానికి ప్రధానంగా బాధ్యత వహించాల్సింది ప్రధాన మంత్రి కార్యాలయం, ప్రధాన మంత్రి మరీ ముఖ్యంగా యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ అన్నారు. బొగ్గు స్కాంకు సంబంధించి కేవలం అశ్వనీకుమార్‌ను మాత్రం తొలగించి చేతులు దులుపుకోవడం దురదృష్టకరం అని అంబటి వ్యాఖ్యానించారు.

ప్రధాన మంత్రి కార్యాలయంలో జరుగుతున్న కుట్రలు, కుతంత్రాల వల్ల దేశంలోనే కాదు ప్రపంచ వ్యాపితంగా భారతదేశం పరువు ప్రతిష్టలు మసకబారిపోతున్నాయని అంబటి ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి సోనియాగాంధీ, ప్రధాని బాధ్యత వహించక తప్పదని అంబటి డిమాండ్‌ చేశారు. ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ రాజీనామా చేయడం ద్వారానే నైతికతను నిరూపించుకోవాలని అన్నారు. ఎవరో ఇద్దర్ని పదవుల నుంచి తొలగించి నైతికతలో మేం అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకుంటే నమ్మడానికి భారత ప్రజానీకం సిద్ధంగా లేరని అంబటి రాంబాబు అన్నారు.

కేంద్రం అంత నైతికత ప్రదర్శిస్తున్నదనుకుంటే... మన రాష్ట్రంలో ఎందుకు ఆ నైతికత కొరవడిందని అంబటి సూటిగా ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రులను తొలగించడానికి ఎందుకు వెనుకాడుతున్నారని నిలదీశారు. రాష్ట్ట్రంలో ఆరుగురు మంత్రులు 26 జిఓలు విడుదల చేస్తే.. వారిలో ముగ్గురిని సిబిఐ ముద్దాయిలుగా చూపించి చార్జిషీట్‌ దాఖలు చేసిందన్నారు. మోపిదేవి వెంకట రమణ నుంచి రాజీనామా తీసుకున్నారు.. జైలులో కూడా పెట్టారన్నారు. కానీ ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిని ముద్దాయిలుగా చూపించడంతో రాజీనామా చేస్తామంటే వారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు... మీ తప్పేమీ లేదని, నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం లేదని వారికి సర్ది చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాక ఆ 26 జిఓలు రావడానికి కారకులైన కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిలను కూడా రక్షిస్తున్నారని విమర్శించారు.

మరో మంత్రి శైలజానాథ్‌ అయితే కోబ్రా పోస్టు స్టింగ్‌ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోతే.. ఎందుకు నైతిక బాధ్యత వహించలేదని అంబటి నిలదీశారు.
Back to Top