రాజు మంచోడైతే దేవుడూ దీవిస్తాడు!



అనంతపురం

28 అక్టోబర్ 2012 : మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజలను కలుసుకుని వారి బాగోగులు అడుగుతూ సాగుతున్న షర్మిల పదునైన మాటలతో తనదైన శైలిలో మనసుకు హత్తుకునే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె పలుకులలోని పంచ్ అబ్బురపరచక మానదు. అనుభవజ్ఞులైన సీనియర్ రాజకీయనాయకులతో సరిపోల్చదగిన రీతిలో ఆమె జనంతో సంభాషిస్తున్నారు.
మార్గమధ్యలో బడన్నపల్లి క్రాస్ సమీపంలో చెన్నారెడ్డి అనే రైతు వేరుశనగ పంటను షర్మిల పరిశీలించారు. తాను పూర్తిగా నష్టపోయానని, భార్య తాళిబొట్టును కూడా బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చానని, ఐదెకరాల్లో 60 వేల పెట్టుబడితో వేరుశనగ పంట వేస్తే ఇప్పుడు పంటకు రూ. 15 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదనీ ఆ రైతు వాపోయాడు. ఇదివరకు మండలం యూనిట్‌గా పంట బీమా అందేదని, ఇప్పుడు దాన్ని తీసేసి వాతావరణ ఆధారిత బీమా ఇస్తున్నారని, దానివల్ల తమకు ఒరిగేదేమీ లేదంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు స్పందించిన షర్మిల ‘‘రాజన్న ఉన్నప్పుడు పరిహారం చెల్లించే ఉద్దేశం ఉంది కాబట్టే గ్రామాన్ని యూనిట్‌గా తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి పరిహారం ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే ఇలా అనేక ఆంక్షలు పెడుతున్నారు. మన్ను తిని బతకాలని చెబుతోంది ఈ ప్రభుత్వం. జగనన్న సీఎం అయితే రైతు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వస్తుంది.’’ అని పేర్కొన్నారు.
ఆ తర్వాత బడన్నపల్లివాసులు తమకు గ్రామాల్లో నీళ్లు లేవని, కరెంటు ఉండడం లేదని వాపోయారు. అర్ధరాత్రి కరెంటు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు పంట వద్దే పడుకోవాల్సి వస్తోందని, ప్రాణాలకు కూడా పూచీ లేకుండా లేదని చెప్పారు. వైయస్ ఉన్నప్పుడు కరెంటు ఉండేదని, వర్షాలు బాగా పడేవని వారు గుర్తుచేసుకున్నారు. అందుకు స్పందిస్తూ షర్మిల "రాజు మంచోడైతే దేవుడు కూడా దీవిస్తాడు. రాజన్న ఉన్నప్పుడు మాట మీద నిలబడ్డాడు. అందుకే అప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంది." అన్నారు.
 శనివారం పాదయాత్ర సాగుతున్నప్పుడు స్థానికులు నీటి సమస్యను షర్మిలతో చెప్పుకోగా, "రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నప్పుడు పెన్నా రిజర్వాయర్‌కు 10 టీఎంసీల నీటిని తీసుకురావడంతో నీటి సమస్య తలెత్తలేదు. కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు ఆ నీళ్లు రాక భూగర్భజలాలు అడుగంటిపోయాయి. జిల్లాలో దాదాపు 30 వేల బోర్లు ఎండిపోయాయి. ఈ ప్రభుత్వం నిద్రపోతోంది. ముఖ్యమంత్రికేం బాగానే ఉన్నారు. మూడు కిలోమీటర్లు పోయి ఆయన భార్య నీళ్లు మోసుకొస్తే ఆ బాధ ఏమిటో అర్థమయ్యేది. ఈ పాపం ఈ సర్కారుదే"అని షర్మిల వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Back to Top