రాజకీయాల్లో మానవత్వం మాయమైంది

రాజకీయాలలో మానవత్వం కనుమరుగైందని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సో దరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆమె సాక్షి టీవీకి ఇచ్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివిధ అంశాలను స్పృశించారు. నాన్న రాజశేఖరరెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన కురిపించిన అభిమానాన్ని ఆమె సజల నయనాలతో వివరించారు. జగనన్న కష్టాలకు కారణం ఇచ్చిన మాట మీద నిలబడడమేనన్నారు. ఇంటర్వ్యూ పూర్తిపాఠం..
ప్ర:

మీ నాన్నగారి సమాధి వద్ద ప్రార్థనతో మరో ప్రజా ప్రస్థానాన్ని ప్రారంభించారు. మీ నాన్నతో మీరేం చెప్పారు. మీ నాన్న మీకేం చెప్పారు.?
శ్రీమతి షర్మిల: 'నాన్నా! నువ్వెళ్ళి మూడేళ్ళయ్యింది. ఈ మూడేళ్ళలో మన కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవించింది. అన్న ఎంతో కష్టపడుతున్నాడు. ఈ కష్టాల ముందు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పెద్ద కష్టం కాదనిపించింది. జోసెఫ్ కు సాయ పడినట్లే జగనన్నకు కూడా సాయపడాలని నాన్నకి, దేవునికి' చెప్పి బయలుదేరా.
ప్ర: మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర కష్టమని మీ బంధువులు కానీ, ఇంకెవరైనా కానీ చెప్పలేదా..?
ష: చాలా కష్టమని చెప్పారు. బస్సు యాత్ర చేయమన్నారు. పాదయాత్ర వెనుక జగనన్న ఉద్దేశం చాలా గొప్పదనిపించింది. ప్రజలను  ఓదార్చి, రాజన్న రాజ్యం వస్తుందని భరోసా కల్సించాలనిపించింది. వాస్తవానికి జగనన్న ఈ యాత్ర చేయాలనుకున్నారు.  ప్రజలకు నమ్మకం, ధైర్యం కల్పించడం దీని వెనుక ఉద్దేశం. పెద్ద సమస్యను   చిన్న చిన్న ముక్కలుగా చేస్తే పరిష్కారం సులభమవుతుందని నాన్న చెప్పేవారు.
అయినా నేను మూడు వేల కిలోమీటర్లూ ఒకేసారి నడవడం లేదుగా.. రోజుకు 15 లేదా 18 కిలోమీటర్లు నడుస్తానని బంధువులకి చెప్పా. నాన్న రోజుకు  25 నుంచి 30 కిలోమీటర్లు నడిచేవారు. మండుటెండలో నడిచారు. నాన్న ఉన్నా, జగనన్న బయట ఉన్నా పాదయాత్రకు నన్ను అనుమతించే వారు కారు. వారే చేసేవారు. ఈ కారణంగా వద్దన్నవారు నన్ను పాదయాత్రకు అనుమతించారు.
ప్ర:  మీ మాటల్లో మీ నాన్న ప్రేమ కనిపిస్తుంది. బాల్యంలో ఆయనతో పంచుకున్న స్మృతులేమైనా ఉన్నాయా?
ష: చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది. ఆయన ప్రేమ. నేను ఆయన డార్లింగ్‌ని. లెక్కపెట్టి వంద ముద్దులు పెట్టించుకునే వారు. చాలా గారాబంగా చూసుకునే వారు. నన్నెప్పుడు చూసినా చిరునవ్వు నవ్వి 'రా బిడ్డా' అని పిలిచేవారు. నా బుగ్గమీద ముద్దుపెట్టేవారు.
ఆ రోజు రాత్రి అందరం కలిసి కూర్చున్నాం. లోపలికి వెడుతుండగా నాన్నకి ముద్దు పెట్టి కూర్చుంటా. కానీ ఫోను మాట్లాడుతూ ఏదో ధ్యాసలో వెళ్ళి కూర్చున్నా. ఫోను మాట్లాడటం అయిన తర్వాత నాన్న నాకేసి చేయి చాచారు. ఆయన దగ్గరకు వెడుతుండగా మర్చిపోతే ఎలా అన్నారు. అదే ఆఖరు.
ప్ర: బాల్యం అంతా నాన్నేనా.. బ్రదర్ కూడా ఉన్నారా!
ష: అన్న చిన్నప్పటినుంచి బిగ్ బ్రదర్. ఓ  హీరో. చిన్నప్పుడంతా అన్న వెనకాలే తిరిగేదాన్ని. సైక్లింగ్ కి వెడితే వెళ్లేదాన్ని. ఫ్రెండ్సుతో వెళ్ళినా వెళ్ళేదాన్ని.. అన్నకు స్లీవ్ లెస్ ఇష్టముండేది కాదు. చాలా బాధ్యతగా రక్షణగా ఉంటాడు. నన్ను తన పెద్ద కూతురిగా చూసుకునే పెద్ద మనసు అన్నకుంది.
ప్ర: ప్రజా ప్రస్థానానికి వెడతానన్నప్పుడు అన్న ఏమన్నాడు?
ష: సుప్రీం కోర్టులో అన్నకు బెయిలొస్తుందనుకున్నాం. తర్వాత పాదయాత్ర చేయాలనుకున్నాడు. రూట్ మ్యాప్ తయారు చేసుకున్నాడు. రైతులు, విద్యార్థులు చాలా కష్టపడుతున్నారు, వారికి నమ్మకం కలిగించాలనుకున్నాడు. తీర్పు సమయానికి అన్న దగ్గర ఉండాలని జైలుకు వెళ్ళాం. తీర్పు విని నిరాశచెందాం. క్ష ణాల్లో అన్న తేరుకుని ధైర్యంగా ఉండండన్నారు. అప్పుడు అన్నా! నీకోసం నేనేం చేయలేనా, ఏమైనా చేస్తా, ప్రాణాలైనా ఇస్తానని చెప్పా. అన్న నా తలపై చేయిపెట్టి నవ్వాడు. అక్కడ్నుంచి పాదయాత్ర చేయాలన్న తలంపు కలిగింది.
ప్ర: మీరు, భారతిగారు బాధపడుతున్నప్పుడు జగన్ బాధ పడలేదా.?
ష: బెయిలు రాలేదన్న బాధ కంటే.. పాదయాత్ర చేయలేకపోతున్నాననే బాధ అన్నలో ఎక్కువ కనిపించింది.  ప్రజల మధ్యలోకి వెళ్ళాలని ఎంత తపన పడుతున్నాడోనని బాధ వేసింది.
ప్ర: పాదయాత్ర మీ నాన్నలో మార్పు తెచ్చిందంటారు. ఓదార్పు యాత్రతో జగనన్నలో మార్పు వచ్చిందంటున్నారు. మరో ప్రజా ప్రస్థానం మీలో ఎలాంటి మార్పు తెచ్చింది.?
ష: ఎన్నో సంఘటనలు. ఓ వృద్ధురాలు వచ్చి మీ నాన్న ఉన్నప్పుడు పింఛను వచ్చేది. నాక్కూడా పింఛను కావాలని అడిగాను. మీ భర్త చనిపోతే ఇస్తామన్నారు. భర్త బతికి ఉన్న భార్యతో అలా మాట్లాడ్డం చాలా బాధాకరం. రాష్ట్రంలో పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి. మహిళలు దుర్భర స్థితిలో ఉన్నారు. స్కూలుకు పంపించాలని ఉన్నా.. వారిని కూడా పనికి పంపకపోతే డబ్బులు చాలవు. అంత తప్పని సరి పరిస్థితులున్నాయి. శివ అనే గొర్రెల కాపరి మోస్తున్న బాధ్యతను చూసి చాలా బాధేసింది. స్కూలుకెళ్ళడం నాకు ఇష్టమక్కా.. కానీ నాన్నను చూసుకోవాలి కదా.. గొర్రెలను మేపాల్సిందే అన్నాడు.
అస్రీన్ అనే అమ్మాయి డిస్టింక్షన్లో పాసయ్యింది. బీఫార్మసీ చదవాలనుంది. నాన్న బీదవాడు. ప్రభుత్వం సాయం చేయడం లేదు. అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. చాలామంది చదువుకోవడానికి కుదరక పనులకు వెడుతున్నారు.
ప్రజల అవసరాలు తీర్చడం ఎంత ముఖ్యమో నాకు యాత్రలో తెలిసింది. నాన్న అలాగే తీర్చాడు. ప్రస్తుతం ప్రజల కష్టాలు తీరాలంటే జగనన్న రావాలి. ఆరోజు వస్తుందని ప్రజలకు చెప్పడం నా మిషన్ గా మారింది.
దస్తగిరి అనే రైతు.. పంట వేశాడు. పోయినేడాది లక్ష డెబై వేలు నష్టం వచ్చింది. ఈ ఏడాదీ నష్టమే వచ్చేలా ఉంది. మూడు లక్షల అప్పులున్నాయన్నాడు. ధైర్యంగా ఉండమన్నా. చేనైనా అమ్మాలి పురుగుల మందైనా తాగాలి అని చెప్పాడు. జగనన్న వస్తే రైతు రాజవుతాడు, మీ కష్టాలు తీరుస్తాడు అని భరోసా ఇచ్చా. ఆయన వచ్చేవరకూ తినేదానికి ఉండాలి కదమ్మా అని ప్రశ్నించారు.
ప్ర: చంద్రబాబును తెగ విమర్శిస్తున్నాననిపించడంలేదా?
ష: విశ్వసనీయతే మనిషికి విలువనిస్తుందని నాన్న చెప్పేవారు. చంద్రబాబుకి విశ్వసనీయత ఉంటే విమర్శించాల్సిన అవసరం నాకు వచ్చేది కాదు. చంద్రబాబు మొదట కాంగ్రెస్ లో ఉండి.. నాన్న సహాయం చేస్తే మంత్రి అయ్యాడనే విషయం అందరికీ తెలుసు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడి పోటీ చేసి ఓడిపోయాడు. విశ్వసనీయత ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే చంద్రబాబు ఉండేవారు. కానీ పెట్టేబేడా సర్దుకుని తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అప్పట్లో కార్టూనిస్టు శ్రీధర్ 'ఇల్లరికం వచ్చిన అల్లుడు' అని కార్టూన్ కూడా వేశారు. పదవి కోసం ఆ పార్టీలో చేరారు. ఎంతమంది వద్దన్నా ఎన్టీఆర్ చేర్చుకున్నారు. పిల్లనిచ్చారు.. పదవిచ్చారు.. ఇంత చేసిన ఆయనకు వెన్నుపోటు పొడిచి బాబు ముఖ్యమంత్రి పదవిని లాగేసుకున్నాడు. ఎన్టీఆర్ పిచ్చోడని ప్రచారం చేయించారు. చెప్పులేయించారు. అర్ధాయుష్షుతో చంపేశారు. రెండో సారి 1999లో బీజేపీతో కలిసి కార్గిల్ యుద్ధంలో చనిపోయిన వారి శవాల పేరుతో ప్రచారం చేసి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మంచిపనులేమీ చేయలేదు. నాలుగు వేల మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నాడు. వైయస్ఆర్ ముఖ్యమంత్రయిన తర్వాత ఆ కుటుంబాలకు లక్ష రూపాయలు సాయం చేశారు. బ్యాంకులతో మాట్లాడి వన్ టైమ్ సెటిల్మెంటు కింద రుణాలు మాఫీ చేయించి యాభై వేల రూపాయలు రుణాలు ఇప్పించారు.
ఒకేమాటను వందసార్లు చెబితే నిజమైపోతుందని బాబు అనుకుంటున్నాడు. అలాంటాయన్ని విమర్శించకూడదంటే ఎలాగండి. నాకు బుద్ధొచ్చింది.. రాజన్న రాజ్యం తెస్తానని చెప్పమనండి.. చంద్రబాబునాయుడును విమర్శించడం రేపటి నుంచి మానేస్తాం.   
ప్ర: వైయస్ఆర్ కాంగ్రెస్ విధేయుడు.. ఆ పార్టీని విమర్శించేటపుడు మీకు బాధనిపిస్తుందా?
ష: నిజమే. నాన్న కాంగ్రెస్ మనిషి. ముపై ఏళ్ళు పార్టీకి సేవ చేశారు. ఎన్ని కష్టాలు  ఎదురైనా పార్టీలోనే ఉన్నారు. పాదయాత్ర చేసి తెచ్చుకున్న మైలేజీని చూసి ఎందరో.. నువ్వే పార్టీని పెట్టి గెలవచ్చుకదా అని ఎందరో సూచించినా వినకుండా విధేయుడిగా ఉండి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా.. గాంధీ కుటుంబ పేర్లే పెట్టి విశ్వాసపాత్రుడిగా ఉన్నారు. అలాంటి ఆయనకు కాంగ్రెస్ ఏం చేసింది. ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చింది. నాన్న వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇది సత్యం. కనీస కృతజ్ఙత లేకుండా.. కనీస ఆలోచన లేకుండా ఈ పనిచేసింది. జగనన్న మటుకు వైయస్ఆర్ లాగే విధేయుడిగా ఉన్నారు. 155 మంది  ఎమ్మెల్యేలు జగన్ ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టారు. అయినా జగన్న నేనే ముఖ్యమంత్రినని ప్రకటించుకోలేదు. చంద్రబాబులా జగన్ అధికారం కోసం కాంగ్రెస్ ను వీడలేదు. ప్రణబ్ సాక్షిగా రోశయ్యగారిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారు. మృతుల కుటుంబాలను పరామర్శిస్తానని నల్లకాలువ సభలో జగన్ మాటిచ్చారు. జగన్ కు వ్యక్తిగత ప్రతిష్ఠ పెరుగుతుందని ఆపేయమన్నారు. సోనియాను కూడా కలిసి అడిగాం. వారు అర్థం చేసుకునే స్థితిలో లేరు. అప్పుడూ పార్టీని వదలలేదు. ఇక ఊపిరాడదన్న స్థితిలో జగనన్న పార్టీని వీడారు. ఇచ్చిన మాట నెరవేర్చకపోతే విలువ ఉండదు అన్న నాన్న మాటను నమ్మాడు కనుక జగనన్న ఓదార్పు చేయాల్సి వచ్చింది. రాజశేఖరరెడ్డి పథకాలు ఎందుకు నీరుగారుస్తున్నారు. ఆయన అమలు చేసిన పథకాలు చేయలేకపోయారు కాబట్టి విమర్శిస్తున్నాం. చేస్తే విమర్శించం.
ప్ర: నెట్టెంపాడు దగ్గర ఉద్వేగానికి గురయ్యారు..
ష: ఏ ప్రాజెక్టయినా నాన్నగారి వల్లే వచ్చాయి. చిత్తశుద్ధితో ఆయన చేపట్టకపోయి ఉంటే ఈ దశకు వచ్చేవి కావు. ఆయన చేసిన పనుల వల్ల సాధ్యమైంది. వాటిని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేరు ఉచ్చరించలేదు. ఆయన కనీస బాధ్యత. చాలా బాధేసింది. నెట్టెంపాడు నీటిని చూసి ఎంత సంతోషించేవారోననిపించింది. ఈ మనుషులు, కుళ్లు, విలువలేని రాజకీయాలను చూసి చాలా కలిచివేసింది. పదవులు అనుభవిస్తున్నవారు నాన్నగారిస్తే వచ్చాయి. వీరెవరూ మాట్లాడలేదు. ఎఫ్ఐఆర్ లో చేర్చినపుడు
ప్ర: రాజకీయం అంటే ఏమర్థమైంది.?

ష: చనిపోయింది నాన్న కాదనీ, రాజకీయాల్లో మానవత్వమనీ అర్థమైంది. జగనన్న వస్తే తప్ప అది చిగురించదని అర్థమైంది.
ప్ర: జన్మదినం ఎలా చేసుకుంటారు?
ష: అన్న వచ్చాకే వేడుకైనా, పండగైనా.

ప్ర: పిల్లలు ఓ రోజు మీవెంట నడిచారు.
ష: అమ్మ బాగా తింటున్నావా.. అని అడుగుతుంది. అన్నేమో ఎలా పాదయాత్ర ఎలా చేస్తోందో.. ఎలా ఉందో.. అని ఆలోచిస్తుంటాడు. టేక్ కేర్ అని వదిన చెబుతుంది. రాజ.. అబ్బాయి ఓకే.. కుమార్తె జిల్లీ ఇప్పటికీ మెసేజీలు, ఫోన్లు చేస్తుంది. వారు బాగానే ఉన్నారు.
ప్ర: వైయస్ లేని లోటును ప్రజలు మీలో చూసుకుంటున్నారు....!

ష: ప్రజల చూపిస్తున్న ప్రేమ నాన్న మీద.. అన్న మీద చూపిస్తున్నారు. చాలా ఆప్యాయంగా ఉంటున్నారు.
కుమ్మక్కు రాజకీయాలకు కొత్త తెర లేచింది. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎఫడీఐకి వ్యతిరేకంగా వీరు గైర్హాజరయ్యారు. కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే వేరే ఏమీ చెప్పనక్కరలేదు. సీబీఐని వాడుకుని కాంగ్రెస్ పార్లమెంటులో గెలిచిందని సుష్మా స్వరాజ్ చెప్పారు. చాలా అద్భుతమైన స్టేట్ మెంటిది. నవంబరు 27న జగనన్న బయటకొస్తే.. రెండు రోజుల్లో ఐటీ దాడులు జరిగాయి. చంద్రబాబు మీద దాడులు చేయడానికి వారిదగ్గర సిబ్బంది ఉండరు. జగన్ కాంగ్రెస్ లో ఉండి ఉంటే ముఖ్యమంత్రిగా కానీ, కేంద్ర మంత్రిగా గానీ ఉండేవారని ఆజాద్ అన్నారు. కుమ్మక్కు రాజకీయాల వల్లే బాబు మీద కేసులు లేవు. చంద్రబాబు ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టరు. జగన్ మాట మీద నిలబడ్డాడు కనకే ఈ  కష్టాలు. మంత్రి బొత్స గారి మీద  గానీ, 26 జీవోలు జారీ చేసిన వారి మీద గాని ఎలాంటి చర్యలు ఉండవు. వారు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ఉండవు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా పార్టీలన్నింటికి బుద్ధి చెబుతారు.

ష: పిల్లలకు పేరు పెట్టమన్నపుడు..షర్మిల అని పెట్టాలనుకోలేదా.

ష: నాన్న.. అన్న.. అమ్మ నాకు స్ఫూర్తిదాయకం. నేనింకా అంత గొప్పదనం కాలేదు.
ప్ర: మీరే మిస్సవుతున్నారు.?
ష: కుటుంబాన్ని, అనిల్.. అందరూ నన్ను పలకరిస్తున్నారు. అన్నని బాగా మిస్సవుతున్నాను. ఆయన రాలేరు. నేను పోలేను. ఆ లోటు తీరడం లేదు. ఇప్పటికి 52 రోజులైంది. చాలా కష్టంగా ఉంది.

తాజా ఫోటోలు

Back to Top