ప్రజల్లో ధైర్యం నింపేందుకే షర్మిల యాత్ర

తిరుపతి:

కష్టాలు, కడగండ్లతో జీవితం సాగిస్తున్న రాష్ట్ర ప్రజలకు త్వరలోనే సువర్ణ పాలన రాబోతోందని ధైర్యం చెప్పేందుకే షర్మిల పాదయాత్ర చేపట్టారని తిరుపతి ఎమ్మెల్యే, వైయస్ఆర్‌ కాంగ్రెస్ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ఆయన  విలేకరులతో మాట్లాడారు. షర్మిల పాదయాత్ర శనివారానికి రెండో నెలలోకి అడుగుపెట్టిందని తెలిపారు. గత నెలరోజుల్లో 128 గ్రామాలు, 5 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో షర్మిల పాదయాత్ర చేశారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వైయస్ జగన్మోహన్‌ రెడ్డిపై అమానవీయంగా, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆయన విమర్శించారు. జగన్ జైల్లో ఉన్నా నిరంతరం ప్రజల వెతలు, వాటి పరిష్కార  మార్గాల గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. పార్టీ శ్రేణులకు ప్రజలపట్ల బాధ్యతను గుర్తుచేయడానికే షర్మిల అనే పాశుపతాస్త్రాన్ని వదిలారన్నారు. ప్రపంచ చరిత్రలో ఒక మహిళ మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాఖలాలు లేవన్నారు. షర్మిలకే ఈ ఘనత దక్కుతుందన్నారు. నెలరోజుల పాదయాత్రలో షర్మిల వెంట 14 లక్షలమంది ప్రజలు నడిచారని వివరించారు. యాత్ర నిరాటంకంగా ఆరునెలలపాటు కొనసాగుతుందన్నారు.

Back to Top