ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధం: విజయమ్మ

హైదరాబాద్ 25 మార్చి 2013:

ప్రజల పక్షాన పోరాటానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రకటించారు. వామపక్షాలు చేపట్టిన విద్యుత్తు ఉద్యమానికి పార్టీ తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది.  శ్రీమతి వైయస్ విజయమ్మ, కొందరు ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష శిబిరానికి  వెళ్ళి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైమేరకు ప్రకటన చేశారు. 2003లో వామపక్షాలు చేపట్టిన విద్యుత్తు ఉద్యమంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కూడా పాల్గొన్న విషయాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. విద్యుత్తు సమస్య కారణంగా ఒక్క ఎకరమూ ఎండిపోలేదంటూ సీఎం కిరణ్ చేసిన ప్రకటనను ఆమె ఎద్దేవా చేశారు. పంటలు ఎండిపోయాయాని తాము రుజువు చేస్తామని సవాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నియోజకవర్గమైన పీలేరు నుంచే మొదలు పెడదామని ఆమె కోరారు. ఆరోజు తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

సంస్కరణల పేరిట ప్రజలపై భారమా: మైసూరా రెడ్డి


అన్ని ప్రతిపక్షాలు చార్జీల పెంపు అక్రమమనీ, అన్యాయమనీ చెబుతున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి తెలిపారు. సర్చార్జీల విషయంలో రెగ్యులేటరీ కమిషన్ ముందు అభ్యంతరాలూ వ్యక్తంచేశామన్నారు. విద్యుత్తు రంగంలో సంస్కరణల పేరుతో ప్రాజెక్టులను ప్రైవేటుకు అప్పజెప్పి  ప్రజలపై భారం మోపడం అన్యాయమన్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆదాయం బాగా పెరిగిందన్నారు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం 1, 20 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని తేలిందనీ, అంత ఆదాయం వస్తున్నప్పుడు ప్రజలపై భారం మోపకుండా ప్రభుత్వమే భరించాలనేది అందరి అభిప్రాయమనీచెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్లే చార్జీలు విపరీతంగా పెరిగిపోయతాన్నాయని విమర్శించారు. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు, గ్యాస్ ధరలను అంతర్జాతీయ ధరలతో సమానంగా ఉండాలని పెంచడం వల్ల అదనపు భారం పడుతోందని అభిప్రాయపడ్డారు. ఆ భారాన్నీ ప్రజలపైనే మోపుతున్నారని ఆరోపించారు. బొగ్గు , గ్యాస్ ధరలు అంతర్జాతీయ స్థాయిలో ఉండాల్సిన అవసరమే లేదని స్పష్టంచేశారు. మన ముడి సరకులతో ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేసుకుని ధరలు నిర్ణయించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో ధరలుండాలని ప్రభుత్వాలు భావించడమే ధరల పెరుగుదలకు ముఖ్య కారణమని ఆయన విశ్లేషించారు. ఇటువంటి అవకతవక, అవినీతి విధానాలే ధరలు విపరీతంగా పెరగడానికి కారణమవుతున్నాయని వివరించారు. వాటిని సరిదిద్దుకోకుండానే ధరలు పెంచి ఈఆర్సీ ముందుంచడం చాలా అన్యాయమూ, అక్రమమూ అని మైసూరా రెడ్డి ధ్వజమెత్తారు. రెగ్యులేటరీ తీర్పు వెలువరించే సమయంలో ఒత్తిడి తెచ్చేందుకు వామపక్షాలు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడాన్ని ఆయన అభినందించారు.  తాము అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. విద్యుత్తు చార్జీలు పెంచాల్సిన అవసరం లేదనీ, ఒకవేళ పెంచాల్సి వచ్చినా ప్రభుత్వమే భరించాలనే ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఉద్యమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు.   జగన్మోహన్ రెడ్డిగారు విద్యుదుద్యమానికి మద్దతు తెలిపి పోరాటాలు చేయాలనీ, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలనీ తమన ఆదేశించారని శ్రీమతి భూమా శోభానాగిరెడ్డి చెప్పారు.  పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ కూడా వీరివెంట ఉన్నారు.

Back to Top