ప్రజాసమస్యల పట్ల సర్కార్ నిర్లక్ష్యంచిగిచర్ల

27 అక్టోబర్ 2012 : ప్రజల సమస్యలను తీర్చే విషయంలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యవైఖరిని అవలంబి  స్తోందని షర్మిల విమర్శించారు. కరెంటు చార్డీల పెంపు దగ్గర నుంచి కరెంటు కోతల వరకూ జనం అష్టకష్టాలు పడుతు న్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా చిగిచర్లలో శనివారం రాత్రి జరిగిన ఒక భారీ బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. జ్వరంతో బాధపడుతూ కూడా ఆమె తన యాత్రను కొనసాగించారు. చిగిచర్లలో షర్మిలకు ఘనస్వాగతం లభించింది. పెద్దయెత్తున జనం ఈ సభకు హాజరయ్యారు.
ప్రతి ఇంట్లో ఒక డాక్టరో, ఒక కలెక్టరో, ఒక ఇంజనీరో ఉండాలనీ, డబ్బు లేని కారణంగా చదువుకోలేక పోవడం జరగకూడదని రాజశేఖర్ రెడ్డిగారు ఫీజు రీ ఇంబర్స్ మెంట్ పథకం తెచ్చారనీ దానికి ఈ ప్రభుత్వం గండి కొడుతోందని ఆమె విమర్శించారు.  పిల్లలను చదివించుకుందామంటే ఫీజుల రీ ఇంబర్స్‌మెంటుకు కాలిస్తామనీ, సగమిస్తామనీ, ముక్కాలిస్తామనీ అంటూ కటింగులు పెడుతోందని ఆమె ఆక్షేపించారు. మిగతా డబ్బుల కోసం ఎక్కడికెళతారండీ! భిక్షం వేస్తున్నారా? చదివిస్తే చదివిస్తామని చెప్పాలి. లేకపోతే చదివించలేమని చేతులెత్తేయాలి. ఇదెక్కడైనా పద్ధతా?" అని షర్మిల ప్రశ్నించారు.
ఆరోగ్యశ్రీ నుండి పలు ప్రధాన వ్యాధులను లిస్టు నుండి తొలగించారనీ, దీంతో పేదలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునే అవకాశం కోల్పోతున్నారని ఆమె అన్నారు. రాజకీయనాయకులకు జబ్బులొస్తే మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకో లేకుండా విదేశాలకో వెళ్లి వైద్యం చేయించుకుంటారనీ, సామాన్యుడు మాత్రం ప్రభుత్వాసుపత్రులకు మాత్రమే వెళ్లాలంటున్నారనీ, ఆమె నిందించారు.
రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నప్పుడు ఫోన్ చేయగానే ఎమర్జెన్సీ సమయాలలో  కుయ్,కుయ్,కుయ్ అంటూ నిమిషాల మీద వచ్చేది. ఈ మధ్య అసలు 108 బొత్తిగా కనిపించడం మానేసిందని ఆమె వ్యాఖ్యానించారు. "రాజన్న ఎంత దూరమయ్యారో 108 కూడా అంత దూరమైపోయిట్లుంది" అని షర్మిల ఆవేదనగా అన్నారు. ఆర్టీసీ, కరెంటు చార్జీలతో పాటు ప్రభుత్వం వంటగ్యాస్ ధరను కూడా అమాంతం అమానుషంగా పెంచేసిందనీ ఆమె విమర్శించారు. బాబు అధికారంలోకి రాక ముందు గ్యాస్ ధర రూ. 145 రూపాయలుండేదనీ, బాబు హయాంలో అది రూ. 305 రూపాయలకు చేరిందనీ ఆమె చెప్పారు. కానీ వైయస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చివరి వరకూ  మహిళలపై భారం పడకుండా గ్యాస్ ధరను పెంచలేదని ఆమె గుర్తు చేశారు. "కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది. ఆరు సిలిండర్లే ఇస్తారట. అదనంగా సిలిండర్ కావాలంటే ఇప్పుడు సుమారు వెయ్యి రూపాయలు పెట్టి గ్యాస్ తీసుకోవలసి వస్తోంoది" అని ఆమె అన్నారు. దీన్నంతా నిలదీయాల్సిన చంద్రబాబు చోద్యం చూస్తూ ప్రభుత్వంతో అంటకాగుతున్నారని ఆమె ఆరోపించారు. పిల్లనిచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్టీఆర్ హామీలైన రెండు రూపాయల కిలో బియ్యం, మద్యనిషేధం కార్యక్రమాలను తుంగలో తొక్కారని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఒక చెడ్డ అలవాటుంది. ఆయన మాట మీద నిలబడలేడు. అప్పుడూ అంతే, ఇప్పుడూ అంతేనని ఆమె ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగ అనీ, జనానికి ఉచితంగా ఏదీ ఇవ్వరాదనీ బాబు రాసుకున్న మనసులో మాట పుస్తకాన్ని ఆమె ప్రస్తావించారు. ఇప్పుడు పాదయాత్ర అంటూ ఎల్లోడ్రామా ఆడుతున్నచంద్రబాబు తాను నాడు
శ్మశానాలుగా మార్చిన గ్రామాల్లో ప్రజల కాళ్లు చేతులు పట్టుకుని క్షమాపణ
అడిగినా ఆయన చేసిన పాపం పోదని మండిపడ్డారు. చిగిచెర్ల శివారులో ఏర్పాటు చేసిన
గుడారాల వద్ద రాత్రి 7.45 గంటల సమయంలో పాదయాత్రను ముగించి షర్మిల బస
చేశారు. ఆదివారం ఉదయం పాదయాత్ర చిగిచెర్ల నుండి ప్రారంభమౌతుంది.

Back to Top