ప్రజా బ్యాలట్ కార్యక్రమానికి విజయమ్మ శ్రీకారం

హైదరాబాద్ 05 ఏప్రిల్ 2013:

విద్యుత్తు చార్జీల పెంపు అంశంపై వైయస్ఆర్ కాంగ్రెస్ తలపెట్టిన ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. నాలుగు ప్రశ్నలున్న బ్యాలెట్‌ను ఆమె స్వయంగా నింపారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సులోని 'కరెంటు సత్యాగ్రహం' దీక్షా ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ బ్యాలట్‌తో ప్రజల వద్దకు పార్టీ వెళ్ళి వారి అభిప్రాయాలను తెలుసుకుంటుంది. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి రోజున ప్రారంభించిన ఈ కార్యక్రమం అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 వరకూ కొనసాగుతుంది. పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ ప్రజా బ్యాలెట్‌తో ప్రజల వద్దకు వెళ్ళాలని శ్రీమతి విజయమ్మ సూచించారు. రైతుల కష్టాలను, పరిశ్రమల ఇక్కట్లనూ, గ్రామీణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులనూ దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ రూపొందించామని ఆమె తెలిపారు. కరెంటు సత్యాగ్రహానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సీపీఎమ్ నేత నోముల నరసింహయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top