పోలీసుల ఊహకు అందనంత అభిమానం

హైదరాబాద్ :

వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదలైన సందర్భంగా పోలీసులు చేసిన భద్రతా చర్యలు తల్లకిందులయ్యాయి. నిఘా సంస్థల ఊహకు కూడా అందనంత భారీ సంఖ్యలో అభిమానులు చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకోవటంతో భద్రతా సిబ్బంది నిశ్చేష్టులయ్యారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు వందల సంఖ్యలో మాత్రమే అభిమానులు వస్తారని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేశారు. దానికి తగినట్టుగానే ఒక కంపెనీ బిఎస్‌ఎఫ్, మూడు ప్లాటూన్ల ఎపిఎస్‌పి బలగాలు, దక్షిణ మండలం పరిధిలోని 10 మంది సిఐలు, 30 మంది ఎస్‌ఐలు, 90 మంది కానిస్టేబుళ్ళు, హెడ్‌కానిస్టేబుళ్లతో పాటు తూర్పు, దక్షిణ మండలాల టాస్కుఫోర్సు సిబ్బందితో డిసిపి తరుణ్‌జోషి మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే జైలు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

కాగా, శ్రీ జగన్‌కు స్వాగతం పలికేందుకు ఉదయం 8 గంటల నుంచే అభిమానులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. చూస్తుండగానే జనప్రవాహం అంతకంతకూ పెరిగిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా అభిమానులు, వైయస్ఆర్‌ కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. నిఘా సంస్థలు కూడా ఇంత మంది వస్తారని ఊహించలేదు. అభిమానులను అదుపు చేసేందుకు ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటు‌ చేశారు. చంచల్‌గూడ జైలు ప్రధాన ద్వారం నుంచి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలను జైలుకు చాలా దూరంలోనే నిలిపేశారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మీడియాను మాత్రమే జైలు ప్రధాన ద్వారం వరకూ అనుమతించారు. అయితే.. అభిమానులు, కార్యకర్తలు బారికేడ్లు, ముళ్ల కంచెలు దాటుకుంటూ జైలు ప్రధాన ద్వారం ముందుకు దూసుకువచ్చారు. పోలీసులు లాఠీచార్జి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. వారు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా నిలబడ్డారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి వెళ్తున్న బుల్లెట్ ప్రూ‌ఫ్ వాహనానికి ఎస్కా‌ర్టుగా పోలీసు వాహనాల కాన్వాయ్ వచ్చినప్పటికీ.. జైలు నుంచి కేవలం రెండు వందల మీటర్ల దూరం వరకు రాగానే అభిమానుల వాహనాలు ఒక్కసారిగా కాన్వా‌య్ మధ్యలోకి దూసుకువచ్చాయి. దీంతో‌ శ్రీ జగన్ కాన్వా‌య్ ముందు, వెనకాల పోలీసు ఎస్కా‌ర్టు వాహనాలు చెల్లాచెదురయ్యాయి.

Back to Top