వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై పోలీసుల జులూం

 ప‌శ్చిమ గోదావ‌రి: తెలుగుదేశం కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న ఖాకీలు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. ఎస్పీ కార్యాలయం సాక్షిగా మరోమారు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. తమ కార్యకర్తలపై పోలీసులు అక్రమకేసుల బనాయిస్తున్నారని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన  వైయ‌స్ఆర్‌సీపీ  నేతలపై ఖాకీలు ఏకంగా ఎస్పీ కార్యాలయ ఆవరణలోనే దాడులు చేయడం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఇసుక తరలింపులో వైయ‌స్ఆర్‌సీపీ  నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు  అక్రమ కేసులు బనాయిస్తున్నారని న్యాయం చేయాలని కోరుతూ దెందులూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ  ఇన్‌ఛార్జ్‌ కొఠారు రామచంద్రరావు మరికొంత మంది కార్యకర్తలు మంగళవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు తిరిగి వెళ్తూండగా జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో  సీహెచ్‌ఎన్‌వీ సత్యనారాయణ అనే కార్యకర్తను  త్రీ టౌన్‌ పోలీసుస్టేషన్‌  కానిస్టేబుల్‌ వి.మురళి అడ్డగించాడు. ఎమ్మెల్యే చింతమనేని నిన్ను తీసుకురమ్మన్నారంటూ చొక్కా పట్టుకుని ఈడ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దాంతో  కానిస్టేబుల్‌ మురళి సత్యనారాయణ ముఖంపై ముష్టిఘాతాలు కురిపించాడు. దీనిపై సమాచారం అందుకున్న కొఠారు రామచంద్రరావు సంఘటనా స్థలానికి చేరుకుని కార్యకర్తపై ఎందుకు దాడి చేస్తున్నావని కానిస్టేబుల్‌ మురళిని ప్రశ్నించారు. దాంతో మరింత రెచ్చిపోయిన  సదరు కానిస్టేబుల్‌ ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ సత్యనారాయణను ఉన్నపాటున తీసుకురమ్మన్నారని సమాధానం చెప్పారు. సత్యనారాయణపై  ఏదైనా కేసు ఉంటే మేమే స్వయంగా స్టేషన్‌కు తీసుకువస్తామని, బలవంతంగా  కానిస్టేబుల్‌ బారినుంచి సత్యనారాయణను విడిపించారు.

Back to Top