బంగారంపై ఆంక్షలు ఎత్తివేయాలి

తిరుపతి: బంగారు ఆభరణాలపై పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన నిర్ణయంపై మహిళల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో మహిళలు శనివారం తిరుపతిలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. తాళి బొట్లు చేతిలో పట్టుకుని, లక్ష్మీ మాత పటాలతో వాన కురుస్తున్నా లెక్కచేయకుండా తమ ధర్నా కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని మహిళలు మండిపడ్డారు.


మహిళల కన్నీటికీ పన్నేస్తారా
ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ మోడీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న బంగారు ఆభరణాలకు లెక్కలు చూపమంటే ఎక్కడ్నుంచి తేవాలని మహిళు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భాతర మహిళల హృదయాలు గాయపడ్డాయని వెల్లడించారు. మంచినీటికి పన్నేస్తున్న ప్రభుత్వాలు.. రాన్రాను ఆడవారి కన్నీటికీ కూడా పన్ను వేస్తారని భయపడుతూ బతుకున్నారని ఎద్దేవా చేశారు. తక్షణమే ప్రధాని మోడీ కల్పించుకుని బంగారంపై ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తూ స్వయంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.
Back to Top