ఫ్యాన్‌ గుర్తుకే ప్రజల ఓటు

  • శిల్పా మోహన్‌ రెడ్డి సౌమ్యుడు, ఉత్తముడు
  • నంద్యాల ఎన్నిక వచ్చే సాధారణ ఎన్నికలకు నాంది
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల 
నంద్యాల: నంద్యాల నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికలో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని, వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందుతున్నారని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి దీమా వ్యక్తం చేశారు. నంద్యాలలో టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎంత డబ్బు ఖర్చే చేసిన ఓటమి తథ్యమన్నారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో చెప్పిన మోసపూరిత హామీలు నెరవేర్చలేదని మారుమూల గ్రామాల్లోని ప్రజలందరూ గమనిస్తున్నారని కోలగట్ల చెప్పారు. చంద్రబాబు మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నిన్న, మొన్న చంద్రబాబు నాయుడు నంద్యాలలో చేసిన ప్రసంగంలోనే టీడీపీ ఓటమి ఖాయమని తేలిపోయిందన్నారు. మూడు రోజుల క్రితం చంద్రబాబు నిర్వహించిన ప్రచారానికి జనం రాకపోవడంతోనే ఆయన బహిరంగ సభలు, రోడ్డు షోలు నిలిపివేశారన్నారు. ఉప ఎన్నికలో టీడీపీ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని కోటగట్ల ఆరోపించారు. 

అధికార పార్టీ ప్రచారంలో పాల్గొనే వారికి రోజుకు ఒక్కోక్కరికి రూ.500 చొప్పున ఇస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నిక 2019 సార్వత్రిక ఎన్నికలకు నాంది కాబోతుందన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో తిరిగి రాజన్న రాజ్యం రావాలని అందరూ ఎదురుచూస్తున్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. నంద్యాలలో ప్రతి ఒక్కరూ తమ చేతులతోనే ఫ్యాన్‌గుర్తు చూపుతున్నారని,  వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి గెలుపు ఖాయమైందని పేర్కొన్నారు. శిల్పా సౌమ్యుడు, ఉత్తముడని కొనియాడారు. నంద్యాల ప్రాంతం ప్రశాంతమైందన్నారు. ఇక్కడ ఎలాంటి అలజడులకు తావు లేదన్నారు. యావత్తు ప్రజానీకం ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని నిర్ణయం తీసుకోవడంతో నంద్యాలలో అత్యధిక మెజారిటీతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని కోలగట్ల  చెప్పారు.
Back to Top