పత్తి పొలంలోకి వెళ్ళి పరిశీలించిన షర్మిల

కపటి (కర్నూలు జిల్లా) , 14 నవంబర్‌ 2012: ప్రభుత్వం ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్‌ సరఫరా కాక, బోర్ల నుంచి నీళ్ళు భూమి పైకి వచ్చే దారిలేక ఎండిపోయిన పత్తి పొలాల్లోకి స్వయంగా వెళ్ళి వాటి పరిస్థితిని షర్మిల పరిశీలించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆయన సోదరి షర్మిల బుధవారం కర్నూలు జిల్లా కపటి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.

గ్రామ శివారులోని పత్తి పొలాల్లోకి వెళ్ళిన షర్మిల అక్కడి రైతులను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కపటి గ్రామ పత్తి రైతులు షర్మిల ముందు తమ గోడును వెళ్ళబోసుకొని విలపించారు. నకిలీ విత్తనాల కారణంగా పంట దిగుబడి విపరీతంగా తగ్గిపోతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  పంట దిగుబడి తగ్గిపోయి దిగాలు పడుతున్న తమకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కూడా కల్పించకుండా మరింత నష్టానికి కారణమవుతోందని వారు కుమిలిపోయారు. వ్యవసాయానికి 7 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రోజుకు కనీసం ఒకటి రెండు గంటలైనా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. విద్యుత్‌ సరఫరా లేని కారణంగా తమ పంటలన్నీ ఎండిపోతున్నాయని కపటి గ్రామ రైతులు ఆవేదన చెందారు. ఒక్కో ఎకరాకు 10 వేల రూపాయలు పెట్టుబడి పెట్టినప్పటికి పంట చేతికి వచ్చేటప్పటికి తమకు కనీసం 5 వేలు కూడా రావడంలేదని బావురుమన్నారు.

ఇదే సందర్భంగా షర్మిలను వలస కూలీలు కలుసుకుని తమ అవస్థలను ఏకరువు పెట్టారు. వ్యవసాయ పనులు లేక తామంతా హైదరాబాద్‌, బెంగళూరు లాంటి సుదూర ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకుని వలస వెళ్ళాల్సిన దుస్థితి నెలకొన్నదని విచారం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న కూలి గిట్టుబాటు కావడం లేదని వారు షర్మిల ముందు చెప్పుకుని విలపించారు.

కపటి గ్రామ రైతులు, వ్యవసాయ కూలీల వ్యధార్థ గాధలు విన్న షర్మిల కదిలిపోయారు. జగనన్న నేతృత్వంలో త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, మీకు మంచి రోజులు వస్తాయని, కష్టాలన్నీ తీరిపోతాయని భరోసా ఇచ్చారు. బుధవారంనాడు షర్మిల పాదయాత్రలో పార్టీ ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top