పన్నులు పెంచని ఘనత వైయస్ఆర్‌ది

నాదర్‌గుల్ (రంగారెడ్డి జిల్లా):

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల కష్టాలను చూసి ఒక్క రూపాయి కూడా పన్ను పెంచలేదని ఆయన తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల అన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచినా, ఆ ధరల ప్రభావం మహిళల మీద పడకూడదని సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే చెల్లించిందన్నారు. ఏ విభాగంలోనూ పన్నులు పెంచకుండానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు.
   
   'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని నాదర్‌గుల్ గ్రామంలో శ్రీమతి షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. మహానేత ఉన్నప్పుడు 120 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు ఇప్పుడు 420 రూపాయలు వస్తోందన్నారు. రూ.305 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.500లకు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గ్రామాల్లో విద్యుత్ సమస్యలు వర్ణనాతీతమన్నారు. కనీసం మూడు గంటలు కూడా సరిగా కరెంటు రావడంలేదని శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకు వచ్చారు.

     ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూస్తూ, వారి ఆవేదనను అర్థం చేసుకున్న శ్రీమతి షర్మిల ప్రభుత్వంపై మండి పడ్డారు. ఈ పాలకులకు పాపం తగులుతుందన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోకుండా పన్నులు, చార్జీలు పెంచుతూ మరింత భారం వేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన ఎనమిదేళ్ల పాలనలో 8 సార్లు చార్జీలు పెంచారన్నారు.  కరవుతో అల్లాడుతున్న రైతన్నలు పెంచిన ఆ కరెంటు చార్జీలు చెల్లించకపోతే కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలోనే మూడు సార్లు కరెంటు చార్జీలు పెంచిందన్నారు. అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజలపై మరింత భారం వేసిందన్నారు. ప్రజలను దోచుకోవడంలోనూ, పన్నుల భారం మోపడంలోనూ దొందూ దొందేనని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు.

     మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరంతా తోడుగా ఉండాలని శ్రీమతి షర్మిల కోరారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మీ కష్టాలన్నీ తీరుస్తారని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగవ రోజు కొనసాగుతున్న శ్రీమతి షర్మిల పాదయాత్రకు నాదర్‌గుల్ గ్రామ ప్రజలతో పాటు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

Back to Top