హైదరాబాద్, 2 అక్టోబర్ 2012: జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారంనాడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాల్లో 4,800 మంది రక్తదానం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నారాయణగూడలోని వైయంసిఎ గ్రౌండ్సులో నిర్వహించిన శిబిరంలో మహిళలు, ఐటి ఉద్యోగులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఈ రక్తదాన శిబిరాన్ని నెల్లూరు ఎంపి, వైయస్‌ఆర్ సిపి సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రారంభించారు. పార్టీ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ గోసుల శివభరత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం జరిగింది.
ఈ శిబిరంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్, సీఈసీ సభ్యుడు రాజ్‌సింగ్ ఠాకూర్, బీసీ సెల్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు, యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారికి పార్టీ నాయకులు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ, రక్తదానం మొత్తం రాష్ట్రం అంతటా అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. బంద్ లేకపోతే ఇంకా విశేష స్పందన వచ్చి ఉండేదన్నారు. వైయస̴్ఆర̴్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం చేస్తున్న కృషిని అభినందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా తమ విభాగం నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో 4,800 మంది రక్తదానం చేశారని శిబిరం నిర్వాహకుడు శివభరత్‌రెడ్డి ప్రకటించారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, క్యాన్సర్, తలసేమియా, గర్భిణులకు మన రాష్ట్రంలో రక్తం కొరత ఎక్కువగా ఉందని శివభరత్ రెడ్డి తెలిపారు. మన దేశంలో నాలుగు కోట్ల యూనిట్ల రక్తం అవసరం ఉండగా కేవలం 40 లక్షల యూనిట్లే అందుబాటులో ఉంటోందన్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడమే ఈ కొరతకు కారణమన్నారు. రక్తం ఇస్తే తమకు ఏదో అయిపోతుందన్న అపోహే దీనికి కారణమన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం ఆధ్వర్యంలో భవిష్యత్తులో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బాజిరెడ్డి గోవర్దన్, విజయారెడ్డి కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
వైయస్‌ఆర్ జిల్లా కడపలో నిర్వహించిన శిబిరంలో పార్టీ నాయకుడు వైయస్ వివేకానందరెడ్డి పాల్గొని, స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి ప్రజా సేవా కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తమ అందరికీ స్ఫూర్తి ప్రదాత జగన్‌రెడ్డికి తొందరగా బెయిల్ రావాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామన్నారు.