బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా), 16 డిసెంబర్ 2012: తెలుగుదేశం పార్టీ ముసుగులో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనేక అక్రమాలు చేస్తున్నారని టిడిపి రెబల్ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. టిడిపి నుంచి సస్పెండ్ అయిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆదివారంనాడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమక్షంలో వైయస్‌ఆర్ సిపిలో చేరారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని శ్రీమతి వైయస్ విజయమ్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె నియోజకవర్గం బి.కొత్తకోటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబుపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా కాళ్ళ ముందర చంద్రబాబు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేస్తే, ఇప్పుడు చంద్రబాబు ఆ పార్టీతోనే అంటకాగుతున్న వైనంపై విరుచుకుపడ్డారు.
టిడిపిని కాంగ్రెస్‌కు అమ్మేసిన చంద్రబాబు:  కాంగ్రెస్ పార్టీకి టిడిపిని అమ్మేసి నోట్ల రూపంలో మార్చుకుంటున్న వ్యక్తి చంద్రబాబునాయుడు అని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడి నేతృత్వంలోనే ఉంటే 2014 ఎన్నికల తరువాత టిడిపి గత చరిత్రగా మారిపోతుందని, కేవలం పుస్తకాల్లో మాత్రమే మనకు కనిపించే దుస్థితి వస్తుందని హెచ్చరించారు. రాజన్న రాజ్యం తీసుకువస్తామని శ్రీమతి షర్మిల, శ్రీ జగన్మోహన్‌రెడ్డి ధైర్యంగా చెబుతున్నారని, అయితే, చంద్రన్న పాలన తెస్తామని చెప్పలేని పరిస్థితిని టిడిపి నాయకులకు చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలన ద్వారా కల్పించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు టిడిపిని అడ్డు పెట్టుకుని తన స్వార్థం కోసం తెలుగు ప్రజలను చీల్చుకుంటూ దుర్మార్గాలు చేస్తున్నారని ఆరోపించారు. తన తీరును ప్రశ్నిస్తే చంద్రబాబు సహించలేరని అన్నారు. టిక్కెట్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా టిడిపిని నమ్ముకుని మూడు దశాబ్దాలు ఆ పార్టీతోనే ఉన్నామని, అయితే ఆ పార్టీని అమ్ముకున్న వారిని అందలాలు ఎక్కించిన చరిత్ర చంద్రబాబుది అన్నారు.
శిశుపాలుడి తప్పులను శ్రీకృష్ణుడు వంద లెక్కపెట్టి శిక్షించాడని ఆ విధంగానే చంద్రబాబు తప్పులు వెయ్యి లెక్కపెట్టి ఈ రాష్ట్ర ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో తమ ఓటు సంహరించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.
అవును ప్యాకేజ్‌లు తీసుకున్నా:  వైయస్‌ఆర్‌సిపిలో చేరడానికి తాను శ్రీ జగన్మోహన్‌రెడ్డి నుంచి ప్యాకేజ్ తీసుకున్నట్లు చంద్రబాబు, టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలపై ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తాను శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నుంచి ప్యాకేజ్‌లు తీసుకున్నానని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత పేదల ముఖంలో చెరిగిపోయిన చిరునవ్వును తిరిగి తీసుకురావాలన్న ప్యాకేజ్‌ను జగన్మోహన్‌రెడ్డి నుంచి తీసుకున్నానన్నారు. రాజశేఖరరెడ్డి మరణం తరువాత రైతాంగం జీవితాల్లో కమ్ముకున్న కారుచీకట్లను తొలగించే ప్యాకేజ్ తీసుకున్నామన్నారు. గత 30 ఏళ్ళుగా మిగిలిపోయిన తంబళ్ళపల్లె నియోజకవర్గం ప్రజల సాగునీటి కల హంద్రీ నీవా అని, అది రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆగిపోయిందని దానిని తీసుకురావాలన్న ప్యాకేజ్‌ను తీసుకున్నానన్నారు. తాగడానికి కూడా గుక్కెడు నీళ్ళు లేని తన నియోజకవర్గానికి తాగునీరు తీసుకువస్తామన్న ప్యాకేజ్ తీసుకున్నానన్నారు. నిత్యం వెనుకబాటుతనంతో కునారిల్లిపోతున్న తంబళ్ళపల్లె నియోజకవర్గం రైతులను ప్రత్యేకంగా చూసుకోవాలన్న ప్యాకేజ్‌ను జగన్మోహన్‌రెడ్డి నుంచి తీసుకున్నానన్నారు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ చేయనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రారంభించిన ఏకైక వ్యక్తి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. ఎప్పుడూ అభద్రతా భావంలో ఉండే మైనార్టీ సోదరుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న సదుద్దేశంతో వైయస్ 4 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. దేవుడికన్నా ఎక్కువగా ఆ మహానేతను హృదయంలో ఉంచుకోవాల్సిన మనం ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్, టిడిపిలు ఇబ్బందులు పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానేత వైయస్ మరణించాక కూడా బతికే ఉన్న విషయం మరిచిపోయారన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఆ పార్టీల నాయకుడు కుట్ర చేసి జైలుకు పంపినా, బ్యాలెట్ పెట్టెలు మన ఊరికి వచ్చినప్పడల్లా ప్రజలు గుణపాఠం చెబుతున్నా చంద్రబాబుకు బుద్ధి తెచ్చుకునే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ప్రజల కోసం ఎన్నో మేళ్ళు చేసిన మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ మరణించాక ఇబ్బందులు పడుతున్న ఆయన కుటుంబానికి తోడుగా ఉంటామని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. వైయస్ కుటుంబాన్ని ఈ రాజకీయ ముఖచిత్రం నుంచి తొలగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు కలిసి చేస్తున్న కుట్రలను ఎదుర్కోవడానికి శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి, శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల చేస్తున్న పోరాటానికి తామంతా అండగా ఉంటామని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని అనాథలా మార్చిన కాంగ్రెస్, టిడిపి:  పేదలకు ఎన్నో మేళ్ళు చేసిన వైయస్ కుటుంబం నష్టపోతే పేదవాడు నష్టపోతారన్నారు. రాజశేఖరెడ్డి కుటుంబాన్ని నిలబెట్టుకోలేకపోతే ఈ రాష్ట్ర రైతాంగం నష్టపోతుందన్నారు. మహానేత కుటుంబం నిలబడితే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ గర్వంతో తల ఎత్తుకుని నిలబడుతుందన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసి మన రాష్ట్రాన్ని ఒక అనాథలా మార్చివేశాయని ప్రవీణ్‌రెడ్డి నిప్పులు చెరిగారు. అనాథలా మారిపోయిన మన రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టి నడిపించాలంటే సమర్థుడైన నాయకుడు రావాల్సిన అవసరం ఉందని ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆ నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అని నమ్మి తామంతా ఆయన వెంట వెళుతున్నామని చెప్పారు. ఒక పవిత్ర హృదయంతో తాము శ్రీ జగన్ వెంట వెడుతుంటే చంద్రబాబు, ఆయనకు మద్దతుగా ఉన్న ఒక వర్గం మీడియా అవమానిస్తున్నారని తెలిపారు. అయితే, ఆ మీడియా రాతలు, ఆ నాయకుల మాటలను తాము స్ఫూర్తిగా తీసుకుంటామని, శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తన నియోజకవర్గం ప్రజల సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు.