పార్టీలకు అతీతంగా 'జన కోటి సంతకం'

బుట్టాయగూడెం‌ (పశ్చిమగోదావరి జిల్లా) : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కోసం పార్టీ ప్రారంభించిన 'జగన్‌ కోసం.. జనం సంతకం' కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా విశేష స్పందన లభిస్తోంది. కేవలం పార్టీకి చెందిన వారే కాకుండా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారు.

 వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ రాకపోవడంతో నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ పిలుపు ఇచ్చారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర వేడుకలను దూరంగా ఉన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జనవరి ఒకటిన స్వగ్రామం దుద్దుకూరులో ఉన్నారు. ఆయనను కలుసుకునేందుకు అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త సంవత్సరం వేడుకలను తమ పార్టీ జరుపుకోవడం లేదని, తనను కలిసేందుకు వచ్చిన అందరూ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. బాలరాజు విజ్ఞప్తితో అభిమానులు, నాయకులందరూ ఉత్సాహంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ, ఈ కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని అకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా చిరునవ్వుల చిందించే రోజులు త్వరలోనే రాబోతున్నాయన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా త్వరలోనే శ్రీ జగన్మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటకు వస్తారని చెప్పారు. ప్రజల మధ్యనే ఉంటూ స్వర్ణయుగ పరిపాలనకు ఆయన శ్రీకారం చుడతారని తెలిపారు.
Back to Top