పాలమూరు ప్రగతికి వైయస్ దీక్షబూనారు

గద్వాల:

పారిశ్రామికంగా జిల్లాను వైయస్ఆర్ అభివృద్ధి పథంలో నిలపాలని ప్రయత్నించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కె.కె. మహేందర్ రెడ్డి చెప్పారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నామని చెప్పిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయకుడు తొమ్మిదేళ్లలో ఈ జిల్లాకు ఏమీచేయకుండానే మోసంచేశారని  ఆరోపించారు. ‘కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి వదిలేశారు. అలాగే నడిగడ్డలోనూ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి ఎన్నికలకు ముందు హడావుడిగా శిలాఫలకం వేసి ప్రజలను నమ్మించాలని చూశారు. జిల్లాప్రజలను కూలీలుగా మార్చిన ఘనత ఆయనకే దక్కింది’ అన్నారు. ఆదివారం నడిగడ్డలో షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాతో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి ఎంతో అనుబంధం ఉందని, జిల్లాలో వలసల సమస్య శాశ్వతపరిష్కారానికి పెండింగ్ ప్రాజెక్టులను చేపట్టారన్నారు. కడప గడపన పుట్టిన వైయస్ రాజధానికి పాలమూరు జిల్లా ద్వారా వెళ్లిన ప్రతిసారి ఈ జిల్లా ప్రజల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచించేవారని గుర్తుచేశారు. జిల్లాలో నాలుగు ప్రధాన ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి వైపు నడిపించాలనే ఆశయంతో పలు పనులు మంజూరుచేశారన్నారు.  ఆయన వారసులైన  జగన్మోహన్‌ రెడ్డి కూడా పాలమూరు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు.

Back to Top