పాదయాత్రతో సర్కార్ పతనం తథ్యం: కిసాన్ సెల్

ఉరవకొండ: షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రతో రాష్ర్ట ప్రభుత్వం పతనమవడం తథ్యమని వైయస్ఆర్ సీపీ కర్నూలు, వైయస్ఆర్ జిల్లాల కిసాన్‌ సెల్ సమన్వయకర్త  వై మధుసూదన్‌రెడ్డి అన్నారు. పాదయాత్రను విజయవంతం చేయాలని మండలంలోని రాకెట్ల, మోపిడి గ్రామాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్  నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. అధికార దాహంతో చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్రకు ప్రజా స్పందన పూర్తిగా కరువవుతోందన్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందు కోసం షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో కాంగ్రెస్, టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అశోక్‌కుమార్, శ్రీనివాసులు, నాగరాజు, అనిల్, బాబు, వన్నూరప్ప, రామిరెడ్డి, ఎర్రప్ప, రామన్న, ఓబన్న, లక్ష్మన్న, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top