పాదయాత్ర పార్టీ ఉనికికోసమే: ఎల్‌ఎం

కళ్యాణదుర్గం టౌన్: తెలుగుదేశం పార్టీ ఉనికి కోసమే చంద్రబాబునాయుడు పాదయాత్ర చేపడుతున్నారని వైయస్ఆర్‌ సీపీ జిల్లా నేత ఎల్‌ఎం మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ర్టంలో ప్రజా సమస్యలను వదిలేసి టీడీపీ ఆదరణ కోల్పోయిందన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై వైయస్ఆర సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైలుకు పంపి ప్రజల్లో మరింత చులకనైపోయిందన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావరణ ఆధారిత పంటల బీమా అందక రైతులు ఇబ్బందులు పడినపుడు టీడీపీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. జిల్లాలో కరవు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేలేదని ప్రశ్నించారు. మహానేత వైయస్. రాజశేఖరరెడ్డి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించేందుకు పాదయాత్ర చేపట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారన్నారు. విద్యుత్తు చార్జీలు తగ్గించాలని ఆందోళన చేసిన రైతులపై కాల్పులు జరిపించి ముగ్గురిని పొట్టనపెట్టుకొన్న ఘనత చంద్రబాబుదేనన్నారు. టీడీపీ అధినేతకు చేతనైతే జిల్లా రైతుల సమస్యలపై పోరాడి న్యాయం చేయాలని సూచించారు.

Back to Top