పాదయాత్ర జగన్ ఆకాంక్ష: విజయమ్మ

హైదరాబాద్:  రాష్ట్రంలో ఎనిమిది కోట్ల కుటుంబాలు మనమీద ఆధారపడి ఉన్నాయి.  మనం వారి మధ్యే ఉండాలి, వారికి భరోసా ఇవ్వాలి.. అందుకు పాదయాత్ర చేయడం ఒకటే మార్గం.. ఇది వైయస్ జగన్ ఆకాంక్షని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వెల్లడించారు. ఇప్పుడెందుకు యాత్ర చేస్తున్నారని పలువురు ప్రశ్నించడాన్ని ఆమె తప్పుబట్టారు.  2003లో టిడిపి పాలనతో రాష్ట్ర ప్రజలు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతుండడంతో వారి కష్ట సుఖాలు తెలుసుకుని వారిలో ధైర్యం నింపేందుకే అంతటి ఎండలో కూడా వైయస్‌ ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా అలాంటి దుర్భర పరిస్థితులే రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. 'జగనే ఈ పాదయాత్ర చేయాలని భావించాడు. గత నెల బెయిల్‌ వస్తుందని, ఈ నెల 5న వస్తుందని ఎదురుచూశాడు. రూట్‌ మ్యాప్‌ కూడా రూపొందించుకున్నాడు. ఆయన రాలేని పరిస్థితి వచ్చింద'ని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాలు పడుతున్న 8 కోట్ల ప్రజల మధ్యన మన కుటుంబం ఉండాలని, వారికి భరోసా ఇవ్వాలని‌, అందుకు పాదయాత్ర చేస్తే బాగుంటుందని జగన్ తమకు చెప్పారన్నారు.  'ఆరోగ్య రీత్యా నేను అంత సుదీర్ఘ పాదయాత్ర చేయలేనని తెలుసు..  అక్కడే ఉన్న షర్మిల పాదయాత్ర కు  ముందుకొచ్చింద'ని  చెప్పారు. విధి లేని పరిస్థితుల్లో తాను ఈ రోజు బయటికి రావాల్సి వచ్చిందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top