పాదయాత్ర చారిత్రక అవసరం, చరిత్రాత్మకం

హైదరాబాద్ 27 అక్టోబర్ 2012 : వైయస్ కుటుంబంపై ప్రజలకు ఉన్నప్రగాఢ విశ్వాసం వల్లనే షర్మిల పాదయాత్రకు అపూర్వ ప్రజాదరణ లభస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు, శాసన  సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. షర్మిల మరో ప్రజా  ప్రస్థానం పాదయాత్రకు వెల్లు  వెత్తుతున్న ప్రజాభిమానమే వైయస్ కుటుంబం పట్ల జనంలో ఉన్న నమ్మకానికి తార్కాణమని ఆయన అన్నారు. శనివారం వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన షర్మిల పాదయాత్ర చారిత్రక అవసరమనీ, చరిత్రాత్మకమనీ పేర్కొన్నారు. వైయస్ సంక్షేమపథకాలను తుడిచిపెట్టే కుట్ర చేసి, ప్రజలను అష్టకష్టాలకు గురి చేస్తున్నారనీ, ఈ ప్రజాకంటక పాలనకు చంద్రబాబు మద్దతు పలుకుతున్నారనీ ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి చంద్రబాబు ప్రభుత్వంతో చేతులు కలిపారని ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాలకు గండికొట్టడాన్ని వ్యతిరేకిస్తూ,  కాంగ్రెస్-టిడిపి కుమ్మక్కు కుతంత్రాలకు నిరసనగా షర్మిల చేపట్టిన పాదయాత్ర ఇప్పటి వరకూ రెండు జిల్లాలలో 38 గ్రామాల మీదుగా 137 కి.మీలు సాగిందనీ, సుమారు ఆరు లక్షల మంది పదం కలిపి కలిసి నడిచారనీ ఆయన చెప్పారు. ఈ యాత్ర ప్రజల కన్నీళ్లు తుడుస్తూ, భరోసా కలిగిస్తూ సాగిపోతోందని ఆయన వివరించారు. షర్మిల యాత్ర ప్రజలలో మళ్లీ ఎనలేని విశ్వాసాన్ని నింపిందన్నారు.
ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యక్తిగత ద్వేషం వల్ల ఉద్దేశపూర్వకంగానే కుతంత్రాలు పన్నుతూ వైయస్ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ జనం నమ్ముతున్నారని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను తీర్చే సత్తా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని జనం విశ్వసిస్తున్నారని, జైళ్లు నోళ్ల తెరిచినా, సంకెళ్లు ఒళ్లు విరిచినా, ప్రజల కోసం నిరంతరం ప్రజాసమస్యల పట్ల అనునిత్యం వెదుకులాడే కళ్లు ఎప్పుడూ జనం కోసమే ఉన్నాయనీ జనం నమ్ముతున్నారని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి భూమన వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా, రాక్షసంగా, అమానవీయంగా జైలులో పెట్టారనీ, ఒక్కరోజు కూడా అధికారంలో భాగస్వామి కాని వ్యక్తివి కుతంత్రాలు పన్ని అరెస్టు చేశారనీ జనం భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. షర్మిల పాదయాత్రకు లభించిన విశేష ఆదరణే దీనికి రుజువని ఆయన అన్నారు. నిజానికి నాడు వైయస్ ప్రజాప్రస్థానానికి లభించిన ప్రజాదరణ కన్నా షర్మిల పాదయాత్రకు ఎక్కువగా ఆదరణ లభిస్తోందని ఆయన అంచనా వేశారు. వైయస్ కుటుంబం జనం కోసమే జీవిస్తుందని ప్రజలు గాఢంగా నమ్ముతున్నారని ఆయన అన్నారు. ధర్మవరం సభలో నలభై వేల మంది కంటే ఎక్కువగా జనం హాజరైన సంగతిని ఆయన ప్రస్తావించారు. కాగా,  హైటెక్కులతో, ట్రిక్కులతో చంద్రబాబు సాగిస్తోన్న పాదయాత్రను జనం నమ్మడం లేదని, అది విషాదయాత్రగా మిగిలిపోతుందనీ ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్ని కుట్రలు చేసినా జనం నమ్మరని ఆయన అన్నారు. స్టాండ్ బైని తెచ్చుకుని బాబు పాదయాత్ర కొనసాగిస్తారేమోనన్నారు. వైయస్ఆర్ సీపీలో చేరడానికి చాలా మంది నాయకులు ఉవ్విళ్లూరుతున్నారనీ, బాబు పాదయాత్రలో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఎమ్మెల్యే రాలిపోతాడని ఆయన ఎద్దేవా చేశారు. పదిహేను రోజుల పాటు అనంతపురం జిల్లాలోనూ, వారం పాటు కర్నూలులోనూ పాదయాత్ర చేశాక, షర్మిల మరో ప్రజాప్రస్థానం తెలంగాణలోకి అడుగుపెడుతుందని భూమన చెప్పారు.

Back to Top