ప్రజాసమస్యలపై చర్చకు ప్రతిపక్షం సిద్ధం

మందబలంతో వ్యవహరించకండి
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
విజయవాడ: మందబలంతో మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామనే వైఖరిని నూతన అసెంబ్లీ భవనంలో మానుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధికార పక్షాన్ని హెచ్చరించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేతతో జరిగిన శాసనసభ్యుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజా గొంతుక, ప్రతిపక్ష గొంతుకను అసెంబ్లీలో నొక్కేయాలనే ధోరణిలో కాకుండా నూతన రాజధాని అసెంబ్లీ భవనంలోనైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని కోటంరెడ్డి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అద్దం పట్టే విధంగా, భవిష్యత్తు తరాలకు దశ, దిశ చూపించే విధంగా అనేక రకాల ప్రజా సమస్యలపై చంద్రబాబు సర్కార్‌ చర్చించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా మధ్యాహ్నం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌రెడ్డిలు నామినేషన్‌ దాఖలు చేస్తారని తెలిపారు. 

ప్రజా సమస్యలపై చర్చ జరగాలి
ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించడానికి ప్రతిపక్షం సిద్ధంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. గడిచిన మూడు సంవత్సర్లాలో ఏ ఒక్క చట్ట సభలోనైనా ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చ జరగలేదని మండిపడ్డారు. కొత్త రాజధానిలో జరిగే తొలి అసెంబ్లీ సమావేశాలపై దేశం అంతా చూస్తోందన్నారు. నూతన సభా ప్రాంగణంలో సభా సాంప్రదాయాలకు అనుగునంగా చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, పార్టీ ఫిరాయింపులపై న్యాయపరమైన చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరారు. సభలో ప్రతిపక్షాలు ఇచ్చే సలహాలు తీసుకొని ముందుకు పోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
Back to Top