టీడీపీ నేతలకు అర్హత లేదు


– డబ్బులతో రాజకీయం వ్యభిచారం మానుకోండి
– దమ్ముంటే ఆ 20 మందితో రాజీనామా చేయించండి
– దేవినేని ఉమాకు జగన్‌ను విమర్శించే స్థాయి లేదు
– విలేకరుల సమావేశంలో జోగి రమేష్‌

వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత దేవినేని ఉమాకు గానీ, టీడీపీ నాయకులకు గానీ లేదని జోగి రమేష్‌ అన్నారు. తమ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని విజయవాడ లో హెచ్చరించారు. ఐటీ శాఖ సోదాల్లో అడ్డగోలుగా దొరికిపోతున్న మీ ఎమ్మెల్యేలను ముందుంచుకుని వైయస్‌ జగన్‌పై అసత్య ప్రచారం చేస్తే మాత్రం సహించేది లేదన్నారు. మా ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొని ఉప ఎన్నికలను కూడా ఎదుర్కొనే సత్తాలేని టీడీపీ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 
పోటీ చేసి గెలిచే దమ్ముందా..
వందల కోట్లు వెచ్చించి అధికార మదంతో ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనడం టీడీపీ వాళ్లకే అలవాటని జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యవహారం మొదట్నుంచి వెన్నుపోటుతోనే సాగిందని ఆరోపించారు. 20 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను అడ్డదారిన పార్టీలో చేర్చుకుని ఉప ఎన్నికలకు వెళ్లే సాహసం కూడా చేయలేరని విమర్శించారు. మీడియా ముందుకొచ్చి ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదని దమ్ముంటే విజయవాడలో తేల్చుకుందాం రమ్మని సవాల్‌ విసిరారు. డబ్బులతో రాజకీయ వ్యభిచారం చేస్తున్న టీడీపీకి విలువలు లేవని ధ్వజమెత్తారు. మా పార్టీ నుంచి టీడీపీలో చేర్చుకున్న 20 మంది ఎమ్మెల్యేల చేత పోటీ చే  యించే దమ్ముందా అని నిలదీశారు. 
సంస్కారం నేర్చుకోండి.. 
టీడీపీ నాయకులు ఎలా మాట్లాడాలో సంస్కారం నేర్చుకోవాలని జోగి రమేష్‌ హితవు పలికారు. వయసులో పెద్దవాడైన డిప్యూటీ ముఖ్యమంత్రి చినరాజప్పను అవమానించిన తీరు లోకేష్‌ సంస్కారానికి నిదర్శనమన్నారు. గ్రామ కమిటీ మెంబర్లకు ఓటుండాలి కదా అని ప్రశ్నిస్తే నోరెళ్లబెట్టిన లోకేష్‌కు కనీసం జ్ఙానం కూడా లేదని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారి సంపాదనకు అలవాటు పడ్డ చంద్రబాబు, లోకేష్‌లకు విలువులెక్కడున్నాయో చెప్పాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు.. కేంద్రంలో మీ మిత్రం పక్షం అధికారంలో ఉన్నారుగా దమ్ముంటే జగన్‌పై నల్లధనం ఉంటే విచారణ జరిపించుకోవాలని సవాల్‌ విసిరారు. తమ నాయకుడు జగన్‌ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. 
ఉమా.. నీ నియోజకవర్గానికి నీళ్లివ్వు చాలు...
పులివెందులకు నీళ్లిచ్చి అక్కడ్నుంచి జగన్‌ను ఓడిస్తానని బీరాలు పలికిన దేవినేని ఉమా సొంత నియోజకవర్గంలో పంటలు ఎండిపోకుండా చూసుకోవాలని సూచించారు. సొంత నియోజకవర్గంలో మిరప, పత్తి, వరి తదితర పంటలు ఎండిపోతుంటే నీరివ్వలేని ఉమా పులివెందులకు నీళ్లిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలు సాగర్‌ జలాలను ఏనాడో మరిచిపోయారని చెప్పారు. ఏదో మైకు దొరికింది కదా నోటికొచ్చినట్టు మాట్లాడితే కుదరదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మీ గొప్పతనాన్ని నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. 
Back to Top