ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రచారంఅధికారంలోకి వచ్చాక సింగపూర్ మయంఉద్యోగాలు ఊడగొడుతున్న ప్రభుత్వం
హైదరాబాద్: ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ముఖ్య హామీల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు, లేదంటే ఇంటికి రూ. 2వేల నిరుద్యోగ భృతి. తీరా అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల ఊసే లేదు, భృతి సంగతి లేనే లేదు. పైగా వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించి ఇంటికి పంపిస్తున్నారు.
హామీలు ఘనం ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా హామీలు గుప్పించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటనలు చేశారు. బాబు వస్తేనే..జాబు వస్తుంది అని ఊదర గొట్టారు. ఒక వేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం నిరుద్యోగ భృతి ఇప్పిస్తామన్నారు. ఆ మేరకు మ్యానిఫెస్టో లో హామీ ఇచ్చారు. ఊరూరా పోస్టర్లు వేశారు. తీరా చేసి, అధికారంలోకి వచ్చాక ఆ హామీని అలాగే వదిలేశారు.
అంతా సింగపూర్ మయంఅధికారంలోకి వచ్చాక చంద్రబాబు అన్ని హామీలను గాలికి వదిలేశారు. రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణమాపీ ల మాదిరిగానే ఉద్యోగాల కల్పన ను కూడా పట్టించుకోలేదు. చివరకు నిరుద్యోగ భృతి అన్న ఊసే లేకుండా పాలన సాగిపోతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దృష్టంతా సింగపూర్ మీదనే పెట్టారు. సింగపూర్ సంస్థలకు వేల ఎకరాలు ఇప్పించే మార్గాల్ని అన్వేషించారు.
ఉద్యోగుల తొలగింపుఉద్యోగాలు ఇవ్వటం మాట దేవుడెరుగు కానీ, ఉన్న ఉద్యోగుల్ని తొలగించి ఇళ్లకుపంపిస్తున్నారు. అధికారంలోకి రాగానే ఆదర్శ రైతులు ఉన్న వేల మందిని ఒక్క కలంపోటుతో ఇంటికి పంపించారు. ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగుల్ని వేల సంఖ్యలో తొలగిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 13, 085 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉంటే ప్రస్తుతం 9వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో 4వేల మందిని తొలగించేందుకు రంగం సిద్దం అయింది. స్థానిక సంస్థల్లోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది ని తొలగిస్తూ వస్తున్నారు.