వైయ‌స్ జ‌గ‌న్ ను విమ‌ర్శించే అర్హ‌త లేదు: ఎమ్మెల్యే బుగ్గన

డోన్ టౌన్:  టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డికి రాజ‌కీయ జీవితాన్ని ప్ర‌సాదించింది దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రతిప‌క్ష‌నేత‌,  వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డికి లేదని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు.  టీడీపీ సర్వసభ్య సమావేశంలో శిల్పా చేసిన ఆరోపణలను బుగ్గన తీవ్రంగా ఖండించారు. ఆదివారం తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్ హయాంలో శిల్పాకు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ఆయన మరచిపోయినా.. ప్రజలకు గుర్తుందన్నారు. మేలును మరచి విమర్శించడం తిన్నింటివాసాలు లెక్కపెట్టడమేనన్నారు. మిడిమిడి జ్ఞానంతో అర్థం లేని విమర్శలు చేయడం శిల్పా మానుకోవాలని హితవు పలికారు. పదవితోపాటు శిల్పాకు హుందాతనం పెరగాలి కాని చౌకబారుతనం కాదని ఆయన అన్నారు. 
 రైతులు, ప్రైవేట్ ఆస్తులను ఆక్రమించడం శిల్పాకు, ఆ పార్టీ నాయకులకు అలవాటేనని.. వీరందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదర్శమని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. శిల్పా రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నష్టమని.. రాజకీయాలేమీ కుంటు పడబోవని బుగ్గన ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో శిల్పా ఎంత మొత్తుకున్నా టీడీపీ టికెట్ దక్కదన్నారు. విలేకరుల సమావేశంలో డోన్ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి, పుల్లారెడ్డి, వెంకోబరావ్, ఆర్‌ఈ రాజవర్దన్, దినేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Back to Top