హైదరాబాద్) కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని కుంభకోణాల కోసం వాడుకొనే దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయని ప్రతిపక్ష నేత, వైస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. కేంద్ర సంస్థల్ని ముందు పెట్టి స్కాములు చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలోనే ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో గృహ విద్యుత్ వినియోగదారులకు ఎల్‌ఈడీ బల్బులను సరఫరా చేసే విషయంలో టెండర్లు పిలిచారా అని వైఎస్ఆర్‌సీపీ సభ్యులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఆ సమయంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలగజేసుకున్నారు.<br/>ఎల్‌ఈడీ బల్బులు 7-8 వాట్లు మాత్రమే వాడుకుంటే, మామూలు బల్బులు 60 వాట్లు వాడుకుంటాయన్న విషయం అందరికీ తెలుసని, దాంతో సహజంగానే ఆదా అయ్యిందని ఆయన చెప్పారు. కానీ మంత్రి మాత్రం నామినేషన్ పద్ధతిలో బల్బులు సరఫరా చేశాం, దాంతో ఆదా అయ్యిందని చెబుతున్నారని.. టెండర్లు పిలిచారా, లోయెస్ట్ బిడ్లకు ఇచ్చారా అని తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని చెప్పారు.<br/>ఈ పనిని నామినేషన్ పద్ధతి మీద ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వలేదని, కేంద్ర ప్రభుత్వ సంస్థకే ఇచ్చామని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.<br/>ఈ దశలో చంద్రబాబు ప్రభుత్వ పనితీరు మీద క్లుప్తంగా వైఎస్ జగన్ చురకలు అంటించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో మొదలుపెట్టి, వాటితో స్కాములు చేయించే కార్యక్రమాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. జెన్‌కోలో బీహెచ్ఈఎల్‌తో పనులు చేయించి స్కాం చేయించారని అన్నారు. బొగ్గు కొనుగోళ్లలో కూడా ఏపీ జెన్‌కో కేంద్ర సంస్థను ముందుపెట్టి.. వాస్తవానికి అదానీలతో బొగ్గు సరఫరా చేయస్తున్నారని తెలిపారు. రేటు తగ్గినా కూడా వాళ్లు పాత రేట్లకే కోల్ సరఫరా చేస్తున్నారని, ఇదంతా పెద్ద స్కాం అవుతోందని చెప్పారు. ఇక్కడ కూడా పనిచేసేది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా.. చివరకు వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచే వసూలు చేస్తారని తెలిపారు.<br/>ఈ సమయంలో.. ప్రతిపక్ష నేత ప్రస్తావించిన బొగ్గు కొనుగోళ్లు, ఇతర అంశాలకు మరో రోజు సమాధానం చెబుతానని, ఇప్పుడు ఎల్‌ఈడీ బల్బుల విషయం గురించి మాత్రమే చెబుతానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అదే సమయంలో తనకు అలవాటైన రీతిలో వ్యక్తిగత విమర్శలకు దిగారు.