నంద్యాల ప్రజలు ఆలోచించి ఓటు వేయండి

– వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి
– నంద్యాల ఉప ఎన్నిక వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి

నంద్యాల: నంద్యాల ప్రజలు చాలా తెలివైన తీర్పు ఇస్తారని చరిత్ర చెబుతుందని, ఉప ఎన్నికలో కూడా ఆలోచించి ఓటు వేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి కోరారు. అధికార పార్టీ బెదిరింపులకు బయపడకుండా స్వేచ్చగా ఓటు వేయాలని ఆయన సూచించారు. శుక్రవారం పట్టణంలోని మసీద్‌ సెంటర్లో శిల్పా మాట్లాడారు. గతంలో నంద్యాల ఓటర్లు పీవీ నరసింహరావును ప్రధానిగా, నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతిని చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తమకు ఓటు వేయకపోతే పింఛన్లు, రేషన్‌కార్డులు తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్క పింఛన్‌ పోయినా, రేషన్‌ కార్డు పోయినా నాది జవాబుదారి అని మోహన్‌రెడ్డి భరోసా కల్పించారు. మీకోసం న్యాయపోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. వైయస్‌ఆర్‌సీపీకి వేస్తే రుణాలు రాకుండా చేస్తామని టీడీపీ నేతలు పొదుపు మహిళలను బెదిరిస్తున్నారన్నారు. బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని అభయమిచ్చారు. తాను దివంగత ముఖ్యమంత్రి  వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశీర్వాదంతో, వైయస్‌ జగన్‌ చలువతో ఆ రోజు మంత్రి అయ్యానని చెప్పారు. రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ నాయకత్వం అవసరమన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. 

దమ్ముంటే రాజీనామా చేయండి
తన తమ్ముడు చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. టీడీపీలోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దమ్మూ, ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. నాడు శోభానాగిరెడ్డి చనిపోయారని సిటీ కేబుల్‌లో ప్రచారం చేయడంతో భూమాకు ఓట్లు వేశారన్నారు. ఇప్పుడు  భూమా నాగిరెడ్డి చనిపోయారని ఆయన ఫోటోలతో మీ వద్దకు వస్తున్నారని,  ఇలాంటి శవ రాజకీయాలను నమ్మొద్దని సూచించారు. నంద్యాల ఓటర్లు బాగా ఆలోచించి న్యాయానికి, ధర్మానికి ఓటు వేయాలని శిల్పా మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

తాజా వీడియోలు

Back to Top