చంద్రబాబు బూటకపు ప్రకటన: బాలినేని

ఒంగోలు :

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన ఆస్తుల ప్రకటన అంతా వట్టి బూటకమని‌, అసత్యాలు, అవాస్తవాలు అని వైయస్ఆర్‌ సిఎల్‌పి విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఒంగోలులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు తన ఆస్తులను ఇప్పుడు ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ఆయన ప్రకటించిన వివరాలు చూసి జనం వెకిలిగా నవ్వుకుంటున్నారు. తమ మొత్తం ఆస్తి విలువ రూ.42 కోట్లు అని చంద్రబాబు చెప్పడం ఏదో విధంగా తాను నిజాయితీపరుడినని చెప్పుకోవడానికే. జూబ్లీహిల్సులోని చంద్రబాబు ఇంటి విలువ రూ.23 లక్షలు అని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. మేం రూ.2 కోట్లు ఇస్తాం. చంద్రబాబు ఆ ఇంటిని మాకు రాసిస్తారా? అని సవాలు చేస్తున్నాం.' అన్నారు.

ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ఆస్తులను ప్రకటించాల్సి ఉంటుందని, అయితే ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు ఆస్తుల విలువను ప్రకటించడం ద్వారా కూడా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఆస్తుల ప్రకటన చేశారన్నారు. నిజాయితీపరుడినని తనకు తాను చెప్పుకోవడం కాదని, జనం చెప్పుకోవాలనే విషయాన్ని సైతం మరిచిపోయిన టిడిసి అధ్యక్షుడిని చూస్తే ప్రతి ఒక్కరికీ నవ్వు వస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఎంత ఖర్చుపెట్టారో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. అలాంటి వ్యక్తి తప్పుడు లెక్కలతో జనాన్ని మోసం చేయాలని చూసినంత మాత్రాన అది నిజమని నమ్మే వెర్రిబాగుల జనం మాత్రం లేరన్నారు.

చంద్రబాబు నిజాయితీపరుడినని నిరూపించుకోవాలంటే సిబిఐ విచారణకు సిద్ధం కావాలని బాలినేని సవాల్‌ చేశారు. అప్పుడే జనం విశ్వసిస్తారన్నారు. చంద్రబాబు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ‌సిబిఐ విచారణ కోరితే కోర్టు స్టే తెచ్చుకోవడాన్ని పరిశీలిస్తే ఆయన నిజాయితీ ఏమిటో అందరికీ అర్థం అవుతుంద’ని బాలినేని అన్నారు.

బినామీ వ్యవహారాల సంగతేమిటి బాబూ: నల్లపురెడ్డి
చంద్రబాబు ప్రకటించిన ఆస్తుల లెక్కలన్నీ పచ్చి బూటకమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. మెడికల్, డెంటల్, ఇంజనీరింగ్ కాలేజీలు, పలు హోటళ్లు, కార్ల కంపెనీల్లో వాటాలను బినామీ పేర్లతో చంద్రబాబు ఉంచారని తెలిపారు. రాష్ట్రంలోనే‌ కాక ఇతర రాష్ట్రాలు, బయటి దేశాల్లోనూ బినామీ పేర్లతో చంద్రబాబుకు వ్యాపారాలున్నాయని చెప్పారు. ఈ మేరకు నల్లపురెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని టిడిపి కార్యాలయానికి సంబంధించిన స్థలం ఎవరి పేరు మీద ఉన్నదో బాబు వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Back to Top