నేడు సాయంత్రం ఎస్‌కెయు వద్ద షర్మిల సభ

అనంతపురం

28 అక్టోబర్ 2012 : షర్మిల తన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం ఎస్.కె.యూనివర్సిటీ వద్ద జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ సభ సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. పాదయాత్ర ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. వైయస్ఆర్ సీపీ రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి శనివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర వివరాలు తెలిపారు. కర్ణాటకలోని పావగడ, బాగేపల్లి నుంచి వెయ్యి ద్విచక్ర వాహనాలపై రెండువేల మంది వరకు యువకులు కందుకూరుకు తరలివచ్చి షర్మిలకు ఘనస్వాగతం పలుకుతారని ఆయన చెప్పారు.
రాప్తాడు నియోజకవర్గంలోని మహిళలు వైఎస్సార్‌సీపీ జెండా నమూనాతో రూపొందించిన చీరలను ధరించి షర్మిలకు హారతులు ఇస్తారని ఆయన తెలిపారు. పాదయాత్ర, బహిరంగసభకు అనంతపురం జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పాదయాత్రకు హాజరయ్యే వారికి భోజనంతోపాటు 50వేల మంచి నీళ్ల ప్యాకెట్లు, 20 వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు ఆయన తెలిపారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు, ఆ పార్టీతో కుమ్మక్కైన టీడీపీ కుట్రలకు నిరసనగా వైయస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తలంతా నల్లబ్యాడ్జీలు ధరించి పాదయాత్రకు హాజరు కావాలని ప్రకాశ్ రెడ్డి సూచించారు.
.

Back to Top