హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ నేత మైసూరా రెడ్డి మండిపడ్డారు. సోమవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాయలసీమకు నీరిచ్చేందుకు పట్టిసీమ అని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మైసూరా విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి రాయలసీమపై శీత కన్ను ఎందుకని ప్రశ్నించారు. రాయలసీమకు నీరిచ్చేందుకు పట్టిసీమ అని మాయమాటలు చెబుతున్న బాబు సర్కార్.. అసలు ఆ ప్రాజెక్టు నుంచి రాయలసీమకు నీళ్లు తరలిస్తామని జీవోలో పేర్కొనకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతకంటే మోసం.. దగా మరొకటి ఉంటుందా?అని మైసూరా అడిగారు. పట్టిసీమ ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకం అవుతుందనే తమ భయమన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపై ఖర్చు పెట్టే వంద కోట్లను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తెలుగు గంగా ప్రాజెక్ట్ కు నిధులెన్ని ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. మద్రాస్ కు నీటిని తరలించాలనే ధ్యాసతో సీమను ఎడారి చేసే ప్రయత్నం చేశారని మైసూరా ఎద్దేవా చేశారు.<iframe width="700" height="400" src="https://www.youtube.com/embed/IxiRXLzl3ww" frameborder="0"/>