తీవ్ర సంక్షోభంలో వ్యవసాయం


– కరువు పరిస్థితుల్లో 14 శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పుకోవడం బాధాకరం
–రైతులను ఆదుకోవాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు.
– ఎన్యుమరేషన్‌కు వెళ్లే అధికారులు మానవతాదృక్పథంతో వ్యవహరించాలి

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వరుస కరువులతో రైతులు అల్లాడుతుంటే ..చంద్రబాబు మాత్రం వ్యవసాయంలో 14 శాతం వృద్ధిరేటు సాధించామని చెప్పుకోవడం బాధాకరమన్నారు. ప్రకాశం జిల్లాకు 140 టీఎంసీల నికర జలాల కేటాయింపులు ఉండగా ఒక్క ఎకరాకు కూడా నీరివ్వని దుస్థితి టీడీపీ పాలనలో నెలకొందన్నారు. రైతులను ఆదుకోవాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదని విమర్శించారు. ఒంగోలు నగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెయిన్‌ గన్లతో కరువును జయించామని బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. రుతు పవనాలను ఒడిసిపట్టుకుంటామని, గత రెండేళ్లలో వ్యవసాయంలో 12 శాతం వృద్ధి రేటు సాధించామని సీఎం గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. గత సంవత్సరం 14 శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పారని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 56 మండలాలు ఉంటే 2014–2015లో 54 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించారన్నారు.  2016, 2017లో 56 మండలాలను ప్రభుత్వమే కరువు మండలాలుగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఆగస్టు చివరి నాటికి ఎక్కడా కూడా వర్షం లేదన్నారు. ఆ తరువాత పడిన వర్షానికి రైతులు ఎంతో శ్రమకోర్చి పంటలు పండించాల్సి వచ్చిందన్నారు. జిల్లాలో 86 వేల హెక్టార్లలో కంది సాగు చేశారన్నారు. నాగార్జున సాగర్‌ కుడి కాల్వకు 40 టీఎంసీల నికర జలాలు ఉన్న కేటాయింపుల్లో ఒక్క ఎకర వరికి నీరు ఇవ్వలేదన్నారు. ఖరీఫ్‌లో వరి 17 వేల ఎకరాలు బోరు బావుల కింద సాగు చేశారన్నారు. ప్రకాశం జిల్లాలో 71.6 శాతం డెప్షిట్‌ వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలో అన్ని పంటలు దెబ్బతిన్నాయన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా గత 15 ఏళ్లలో లేనటువంటి పరిస్థితి ఈ ఏడాది పత్తి సాగులో సంక్షోభం చోటు చేసుకుందన్నారు. పచ్చపురుగు దాడికి శనగ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పరిస్థితి టీడీపీ పాలనలో మరో అనంతపురం జిల్లాలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. టీడీపీ అనుకూల పత్రికల్లోనే ప్రకాశం జిల్లాలోని పశువులు అన్ని కూడా కబేళాలకు తరలివెళ్తున్నాయని ప్రధాన శీర్షికలో ప్రచురితమయ్యాయని తెలిపారు. ఈ పరిణామాలను నివారించే చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడం పెద్ద తప్పిదమన్నారు. ప్రకాశం జిల్లాలో కరువు పరిస్థితులు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.  రైతాంగం ఇంత సంక్షోభంలో ఉన్న సమయంలో ఎన్యుమరేషన్‌కు వెళ్తున్న అధికారులు మానవతాదృక్ఫథంతో వ్యవహరించాలని నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను కోరారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే రైతుల కోసం పని చేయాలని నాగిరెడ్డి సూచించారు. 

 
Back to Top