స్వార్థానికి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు

హామీల అమలులో కేంద్ర, రాష్ట్రాలు విఫలం
నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి వైయస్‌ఆర్‌ సీపీపై బురదజల్లే ప్రయత్నం
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి
రాజీనామా చేసిన ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

నెల్లూరు: తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని, రాష్ట్ర వనరులను తాకట్టుపెట్టారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీనామా చేసిన ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగి ఏ హామీ నెరవేర్చకపోయినా బాబు మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు. నెల్లూరులో మేకపాటి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిసి అన్యాయంగా విభజించాయన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం, సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. 

ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మేకపాటి అన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మేలన్న చంద్రబాబు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గ్రహించి యూటర్న్‌ తీసుకొని హోదా అంటూ మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి మోడీ గ్రాఫ్‌ తగ్గుతుందని చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారన్నారు. బీజేపీని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ  ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్నారు. చంద్రబాబు వైయస్‌ఆర్‌ సీపీపై బురదజల్లేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసానికి నిరసనగా వైయస్‌ఆర్‌ సీపీ వంచనపై గర్జన దీక్షకు పూనుకుందని మేకపాటి చెప్పారు. నెల్లూరు నగరం కేంద్రంగా మరోసారి విశాఖ తరహాలో గర్జన నిర్వహిస్తున్నట్లు వివరించారు. రేపు జరగబోయే గర్జన «కార్యక్రమానికి వైయస్‌ఆర్‌ సీపీ నేతలందరూ పాల్గొంటారని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గాలు, మోడీ చేసిన అన్యాయం ప్రజల ముందు ఉంచుతామన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా నిరసనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 
Back to Top