మొక్కుబడిగా ఛార్జీలు తగ్గిస్తే ఊరుకోం: శోభా

హైదరాబాద్, 4 ఏప్రిల్‌ 2013: పెంచిన కరెంటు ఛార్జీలు మొక్కుబడిగా తగ్గిస్తే ఊరుకునేది లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి అన్నారు. ప్రజల చేతి నుంచి వంద రూపాయలు లాక్కొని ఒక్క రూపాయి భిక్షం వేసినట్లు ఏదో వంద కోట్లో మరి కొంతో ఛార్జీలు తగ్గిస్తే ఊరుకోబోమన్నారు. పెంచిన కరెంట్‌ ఛార్జీల ఆర్థిక భారాన్ని మొత్తం తగ్గించాల్సిందే అని ఆమె డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ హైదరాబాద్ న్యూ‌ ఎమ్మెల్యే క్వార్టర్ల ప్రాంగణంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తున్న 'కరెంట్‌ సత్యాగ్రహం' దీక్షలో పాల్గొన్న శోభా నాగిరెడ్డి పాల్గొన్నారు. దీక్ష మూడవ రోజు గురువారం ఉదయం ఆమె దీక్షా శిబిరం వద్ద మీడియాతో మాట్లాడారు.

‌మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి గతంలో ఉచిత విద్యుత్ ఇస్తామంటే అసాధ్యమని వ్యాఖ్యానించిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు‌ ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పటం హాస్యాస్పదంగా ఉందని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. పెంచిన విద్యుత్ ఛార్జీ‌లు తగ్గించమన్న ఆందోళనకారులపై కాల్పులు జరిపి, చంపించిన ఘనత చంద్రబాబుదే అని ఆమె విమర్శించారు. విద్యు‌త్ అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చె‌ప్పిన తరువాతే టిడిపి దీక్షలు చేస్తే మంచిదని ఆమె అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో టిడిపి నాయకులు కుమ్మక్కయ్యారు కనుకే అసమర్థ ప్రభుత్వాన్ని కాకుండా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పై అక్కసు వెళ్ళగక్కుతున్నారన్నారు.

విద్యుత్ ఛార్జీలు‌ ఒక్క పైసా కూడా పెంచకుండా మహానేత వైయస్‌ఆర్ ‌పరిపాలించారని శోభా నాగిరెడ్డి అన్నారు. చంద్రబాబు సాధ్యం కాదన్న ఉచిత విద్యుత్ను వై‌యస్ ఐదేళ్ళూ ఇచ్చి చూపించారన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం వైయస్‌ కుటుంబానికి ఉందన్నారు.

Back to Top