కరెన్సీ కష్టాలకు బాబే కారణంనోట్ల రద్దుతో వారం రోజులగా మోడీకి నిద్ర కరువుఎన్నికల్లో డబ్బు పంచితే చెప్పులతో కొట్టండి అని సీఎం ప్రకటించగలరా?అవినీతి వల్లే హెరిటేజ్ షేర్ విలువ పెరిగిందినోట్ల రద్దుతో ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేవైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుహైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు జోడి కట్టి దేశాన్ని, రాష్ట్రాన్ని బోడీ చేశారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు ఘనత తనదేనని ప్రచారం చేసుకున్న చంద్రబాబు..ఇప్పుడు మాట మార్చారని, అవకాశవాద రాజకీయాలకు ఆధ్యుడని ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరులకు నిద్ర లేకుండా చేయాలనుకున్న నరేంద్ర మోడీకే వారం రోజులుగా నిద్ర కరువైందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కరెన్సీ కష్టాలు మొదలయ్యాయన్నారు. ఈ ఇబ్బందులు భవిష్యత్తులో అధికమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనదే అయినా..అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. నోట్ల రద్దుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయకపోవడంతో సామాన్య ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాసిన లేఖ వల్లే మోడీ పెద్ద నోట్లు రద్దు చేశారని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు..ప్రస్తుతం ప్రజలు పడుతున్న కష్టాలకు ఆయనే కారణమని ధ్వజమెత్తారు. నోట్ల రద్దుతో ప్రతి ఇంట్లో అన్యాయం జరుగుతోందని, ప్రతి వ్యక్తికీ నష్టం వాటిల్లిందన్నారు.
ఊసరవెళ్లి మాటలు ప్రజలు ఇంతగా ఇబ్బందులు పడుతుంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని దానికి చంద్రబాబును కన్వీనర్‌గా చేయలన్న టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ్మనాయుడి కామెంట్లు చెత్తగా ఉన్నాయని విమర్శించారు. నోట్ల రద్దు నిర్ణయానికి బాబు ఆధ్యుడని, అందుకోసం ఆయనే బాధ్యత వహించాలని అంబటి సూచించారు. నాడు నా వల్లే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారన్న బాబు..ఇప్పుడు ప్లేటు మార్చారన్నారు. మోడీ నిర్ణయం సరైంది కాదంటున్న టీడీపీ నేతలు..అలాంటప్పుడు కేంద్రంలో ఆ పార్టీ మంత్రులు ఎందుకు కొనసాగుతున్నారని నిలదీశారు. చంద్రబాబు ఊసరవెళ్లిలా ఇక్కడో మాట.. అక్కడో మాట మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. చిల్లర దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు రద్దు చేశారా? ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు లేకుండా వెసులుబాటు కల్పించారా బాబూ అని నిలదీశారు. కరెన్సీ కష్టాలు ఉన్న సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని అంబటి రాంబాబు గుర్తు చేశారు.
బాబు అధికారంలోకి వచ్చాకే..రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ షేర్ విలువ పెరిగిందని వైయస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ రెండున్నరేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో విఫరీతంగా అవినీతి పెరిగిందని, ఆ డబ్బు హెరిటేజ్‌లో పెట్టుబడులు పెట్టడంతో షేర్ విలువ అమాంతంగా పెరిగిందన్నారు. బాబు అధికారంలోకి రాకముందు రూ.199 విలువ ఉన్న హెరిటేజ్ ఇప్పుడు రూ.909కి ఎలా పెరిగిందో చెప్పాలన్నారు. నోట్లు రద్దు విషయం బాబుకు ముందే తెలియడంతో ఆ డబ్బు అందులో పెట్టి బ్లాక్‌ను వైట్ చేసుకున్నారని విమర్శించారు.
చెప్పుతో కొట్టండి అని ప్రకటించగలరా?వచ్చే ఎన్నికల్లో డబ్బులు పంచమని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించగలరా? అని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేస్తే చెప్పులతో కొట్టండి అని చంద్రబాబు ప్రకటించుకునే దమ్ము, ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఓ ఎమ్మెల్యేకు లంచం ఇస్తు పట్టుబడిన టీడీపీ నేత రేవంత్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోని పార్టీ అధినేతే ఓ నిందితుడని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.