రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజన

హైదరాబాద్ :

ప్రజల ప్రయోజనాలను నిర్దాక్షిణ్యంగా తోసిరాజని రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ‌నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ పూర్తిగా వ్యతిరేక‌ం అన్నారు. సభలో తక్షణమే సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని శేషుబాబు డిమాండ్ చేశారు.‌ శాసనమండలిలో బుధవారంనాడు ఆయన విభజన బిల్లుపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తంచేశారు.

రాష్ట్ర విభజన జరిగితే దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబ‌ర్సుమెంట్ వంటి‌ పలు ప్రజా సంక్షేమ పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. సంక్షేమ పథకాలు నిలిచిపోతే పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారన్నారు. ప్రజల మనోభావాలను కాదని రాష్ట్రాన్ని విభజించడానికి సోనియా పూనుకోవడం దురదృష్టకరమని శేషుబాబు ఆవేదన వ్యక్తంచేశారు.

Back to Top